‘గ్రేటర్’కు చంద్రబాబు వస్తారా?

5 Dec, 2015 02:09 IST|Sakshi
‘గ్రేటర్’కు చంద్రబాబు వస్తారా?

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కు త్వరలో జరగనున్న ఎన్నికలు తెలంగాణ టీడీపీలో గుబులు రేపుతున్నాయి. వరుసబెట్టి నేత లు ఫిరాయిస్తుండడంతో ఆత్మస్థైర్యం కోల్పోయిన టీ టీడీపీ నేతలు... పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్ర బాబుపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రచారానికి రావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ చంద్రబాబు వచ్చేదీ లేనిదీ తేల్చకుండా.. ‘మీరు స్వతంత్రంగా ఎదగాలి. ప్రతి విషయానికి నావైపు చూడొద్దు..’ అంటూ హితబోధ చేస్తున్నారు. దీంతో టీటీడీపీ నేతలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

 ఉనికి కోసమైనా..
 వరంగల్ ఉప ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న బీజేపీ, టీడీపీలు గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ జట్టుకట్టనున్నాయి. అయితే తెలంగాణలో కనిపించకుండా పోయిన టీడీపీ ఉనికిని కనీసం హైదరాబాద్‌లోనైనా కాపాడుకోవాలంటే... ‘గ్రేటర్’ ఎన్నికల్లో చెప్పుకోదగిన స్థానాల్లో గెలవాల్సిన పరిస్థితి. అసలు సార్వత్రిక ఎన్నికల్లో టీ టీడీపీ గెలుచుకున్న అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా గ్రేటర్ పరిధిలోవే. కానీ ఇక్కడి ఎమ్మెల్యేల్లో నలుగురు అధికార టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకులు ఇక్కడ ప్రచారం చేసి ఫలితం రాబట్టడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో టీటీడీపీ నాయకత్వం పార్టీ అధినేత చంద్రబాబుపైనే ఆధారపడుతోంది.

ఇటీవల హైదరాబాద్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబుతో నేతలు భేటీ అయ్యారు. ‘గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మీరు పాల్గొనాలి. మీరు ప్రచారం చేస్తేనే గట్టెక్కుతాం.’ అని మొరపెట్టుకున్నారని సమాచారం. కానీ ప్రచారానికి వచ్చేదీ, రానిదీ తేల్చకుండా... ‘మీరు స్వతంత్రంగా ఎదగాలి. ప్రతి విషయానికి నావైపు చూడొద్దు..’ అని చంద్రబాబు పేర్కొన్నారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు గ్రేటర్ ప్రచారానికి వస్తారా, లేదా అన్న విషయం తెలియక పార్టీ నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
 
 ఫిరాయింపులతో ఆందోళన

 ఒకవైపు ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు దూసుకువస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో... తమ నేతలు పార్టీ ఫిరాయిస్తుండడంతో టీ టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిపై చర్చించేందుకు టీ టీడీపీ నాయకత్వం శనివారం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కానుందని తెలిసింది. ‘రాజకీయాల్లో ఇవన్నీ సహజం. అధికార పార్టీ తాయిలాలకు లొంగిపోయి పార్టీలు మారే వారుంటారు. అయినా పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజల పక్షాన నిలబడ డానికే ప్రాధాన్యం ఇస్తాం. ఎమ్మెల్యేలు మారుతున్నా, మా క్యాడర్ మాకుంది..’ అని టీ టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు