గోదావరి–పెన్నా నదులను కలుపుతాం

4 Feb, 2017 23:21 IST|Sakshi
గోదావరి–పెన్నా నదులను కలుపుతాం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కరువు వల్ల  పెన్నా నది ఎండిపోవడంతో ఈ సారి జిల్లాలో సాగునీటి కొరత వచ్చిందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. భవిష్యత్‌లో నీటి సమస్య రాకుండా ఉండటం కోసం గోదావరి–పెన్నా నదులను కలుపు తామన్నారు. కొడవలూరు మండలం రాచర్లపాడు ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో పరిశ్రమలకు స్థాపనకు చౌకగా భూములు ఇస్తామని చెప్పారు. కిసాన్‌సెజ్‌లో గమేసా కంపెనీ నిర్మించిన పవన విద్యుత్‌ ఉత్పత్తి విడిభాగాల తయారీ కర్మాగారం, పరిపాలనా భవనాన్ని శుక్రవారం సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. గమేసా కంపెనీ ఆరు నెలల్లో  మొదటి దశ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించడం అభినందనీయమన్నారు.

ఈ సంస్థలో మొదటి విడతగా 500 ఉద్యోగాలు వస్తే ఇందులో 400 ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చారని చెప్పారు. భవిష్యత్‌లో కూడా ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ఆదేశించానన్నారు. రైతులు భూములు ఇవ్వకపోతే అభివృద్ధి జరగదనీ, రెచ్చగొట్టే వారి వల్ల అందరూ నష్టపోతారన్నారు. ఇఫ్కోలో యూరియా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 1996లో సీఎంగా ఉండగా  తానే ఈ భూమి సేకరించి ఇచ్చానన్నారు. సెజ్‌కు అనుబంధంగా రాచర్లపాడులో విడిభాగాల తయారీ పార్క్‌ ప్రారంభిస్తున్నామన్నారు. ఇఫ్కో మీద ఇక ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాననీ, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో కృష్ణపట్నం పోర్టు  కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గమేసా కంపెనీ సీఎండీ రమేష్‌ కైమల్‌ మాట్లాడుతూ సెజ్‌ చుట్టుపక్కల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రైతులు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు  
సెజ్‌కు భూములు ఇస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు దొరకుతాయని ఆశించిన రైతులు ఇప్పుడు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చెప్పారు. ఇలాంటి వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన సీఎంను కోరారు. ఇఫ్కోలో ఎకరం భూమికి రూ.50 లక్షల లీజు తీసుకుంటున్నందువల్ల పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సెజ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనకే అనుమతి ఇవ్వాలని కోరారు. రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చినందువల్ల ఈ ప్రాంతంలో భూమి, నీరు కలుషితమై ఇబ్బంది పడతామని రైతులు ఆందోళన చెందుతున్నారని సీఎంకు చెప్పారు.

సెజ్‌లో ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలనీ, నైపుణ్యం ఉన్న వారు దొరక్క పోతే ఇందుకోసం శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు. సెజ్‌లో దేవస్థానం భూమి కూడా ఉందనీ, దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనీ, భూమికి సంబంధించిన పరిహారం దేవస్థానానికి ఇవ్వాలని కోరారు. మంత్రులు శిద్దా రాఘవ రావు, పొంగూరు నారాయణ, ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, కురుగొండ్ల రామకృష్ణ, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, బీద రవిచంద్ర, నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్, ఏపీఐఐసీ చైర్మన్‌ కృష్ణయ్య, పార్టీ నాయకులు ఆనం వివేకానందరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్, కలెక్టర్‌ ముత్యాలరాజు, జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ , గమేసా కంపెనీ  చీఫ్‌ కార్పొరేట్‌ జనరల్‌ సెక్రటరీ జోస్‌ ఆంటోనియా కోర్టాజరేనా, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వెంకటేష్, ఇఫ్కో సీఈఓ రాజశేఖరయ్య  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఇఫ్కో సీఈఓపై చర్యలు తీసుకోవాలి : సీఎంకు వినతిపత్రం
 ఇఫ్కో సీఈఓ రాజశేఖరయ్య అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపించి ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. భూముల వ్యవహారంలో ఆయన తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలతో అశాంతి ఏర్పడిందని ఫిర్యాదు చేశారు.సెజ్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలనీ,  వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనకే అనుమతులు ఇవ్వాలని కోరారు.   

సీపీఎం నాయకుల నిరసన  
దగదర్తి :  కొడవలూరు మండలం రాచర్లపాడులో శుక్రవారం గమేసా ప్రారంభోత్సవానికి వెళుతున్న సీఎం చంద్రబాబునాయుడుకు మండలంలోని దామవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద ప్రజాప్రతినిదులు, మంత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దామవరం జంక్షన్‌ వద్ద  దగదర్తి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపడంతో పోలీసులు అడ్డుకున్నారు.  

ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ దగదర్తి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని శాంతియుతంగా ప్లకార్డులు మాత్రమే ప్రదర్శించామన్నారు. దీనిని పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. సీఐటీయూ మండల ప్రధానకార్యదర్శి కర్రా పోలయ్య, రైతు సంఘం జిల్లా నాయకుడు జడ్డా మస్తానయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గోపసాని రమేష్, కాలేషా, గురజాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు