చంద్రబాబుది నియంత పాలన

10 Mar, 2017 22:35 IST|Sakshi
చంద్రబాబుది నియంత పాలన

- రాజధాని పేరుతో ‘రియల్‌’ బిజినెస్‌
- టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయి
- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం వైఎస్‌ఆర్‌సీపీదే
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిని గెలిపించండి
- డోన్‌, కమలాపురం ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి


బేతంచెర్ల : రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడి పాలన... హిట్లర్‌ నియంత పాలనను తలపిస్తోందని పీఏసీ చైర్మన్‌, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వగృహంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డితో కలిసి.. డోన్‌ , ప్యాపిలి, బేతంచెర్ల మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, డోన్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్‌లు ప్లాట్ల వ్యాపారం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు.

రాయలసీమలో వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు.. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వలస పోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ఎంపీటీసీ సభ్యులు మొదలుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యే వరకు ప్రజాప్రతినిధుల హక్కులను హరించారన్నారు. పనికో రేటు కట్టి స్థానిక సంస్థలను నిర్వర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదనతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలభోలాకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. మూడు సంత్సరాల టీడీపీ పాలనలో ప్రజల సంక్షేమం కోసం ఏం చేశారని ప్రశ్నించారు.


హామీల అమలేదీ?
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యేలు రాజేంద్రనాథ్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని, పట్టభద్రులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని గుర్తు చేశారు. పన్నులు, రాయల్టీలు పెంచి వ్యాపారులను దగా చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం టీడీపీ ఎమ్మెల్యేలు వెళితే.. బాధితులకు ఒక్కొక్కరికి రూ. 50 వేలు అదే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అయితే రూ.25 వేలకు మించి ఇవ్వడం లేదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలే తప్ప అక్రమాల కు పాల్పడటం తగదన్నారు.


జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం..
రాష్ట్రంలో ప్రాజెక్టుల కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందని,  రాయలసీమ అభివృద్ధి చెందాలంటే తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్యేలు రాజేంద్రనాథ్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి  గెలిపించి వెఎస్‌ఆర్‌ కుటుంబ రుణం తీర్చుకోవాలని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులకు సూచించారు.

ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తన గెలుపునకు కృషి చేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పోచా శీలారెడ్డి, కార్యదర్శి గుండం శేషిరెడ్డి,  జిల్లా కమిటీ సభ్యుడు మూర్తుజావలి, మండల కన్వీనర్‌ లక్ష్మీరెడ్డి , డోన్, ప్యాపిలి జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దీలిప్‌ చక్రవర్తి, మండల సింగిల్‌ విండో అధ్యక్షుడు బుగ్గన నాగభూషణం రెడ్డి, ఎంపీపీ గజ్జి కిట్టమ్మ, పార్టీ నాయకులు మునేశ్వర్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి, రాజేంద్రనాథ్‌రెడ్డి, చందురెడ్డి, ఇబ్రహీమ్, రామచంద్రుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు