సాగునీటిపై చంద్రబాబువి తప్పుడు లెక్కలు

1 Apr, 2017 23:41 IST|Sakshi
సాగునీటిపై చంద్రబాబువి తప్పుడు లెక్కలు
– రేపు వందకేంద్రాల్లో సాగునీటి కోసం సత్యాగ్రహాలు
 - బొజ్జ దశరథరామిరెడ్డి వెల్లడి
నంద్యాలరూరల్‌: సాగునీటి విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబువి అన్ని తప్పుడు లెక్కలు అని, రాయలసీమకు ఆయన తీరని అన్యాయం చేస్తున్నారని  జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్‌ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.  శనివారం నంద్యాలలోని మాజీ ఎంపీ బొజ్జా వెంకటరెడ్డి గృహంలో సాగునీటి సత్యాగ్రహం వాల్‌పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా బొజ్జదశరథరామిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి  రాయలసీమకు 500 టీఎంసీల నీరు అందిస్తామని బాబు చెప్పడం పచ్చి అబద్ధంగా  అభివర్ణించారు. పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమకు నీరు ఇస్తామని చెప్పి చుక్కనీరు ఇవ్వలేదని మండిపడ్డారు.   అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ పెద్దలు మభ్యపెట్టి మోసం చేయడం భావ్యం కాదన్నారు.
 
ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలకు వివరించి రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసేందుకు రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేడపతున్నామన్నారు. ఈనెల 3వ తేదీ సోమవారం కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అన్ని మండల ముఖ్య కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సీమ సత్యాగ్రహం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్‌ ఏర్వ రామచంద్రారెడ్డి, నంది రైతు సమాఖ్య నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, కేసీ పరిరక్షణ సమితి కన్వీనర్‌ బాలీశ్వరరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు మహేశ్వరరెడ్డి, బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి తూముశివారెడ్డి, ప్రచార కార్యదర్శి కానాల సుధాకరరావు‡, తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు