ప్రజలను ముంచిన చంద్రబాబు

8 Jun, 2017 17:53 IST|Sakshi

వంగర : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డితోనే రాజన్నరాజ్యం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్మాన కృష్ణదాస్‌ చెప్పారు.  గురువారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషిచేశారన్నారు. ఆయన హాయాంలో కుల,మత,వర్గాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించి రాష్ట్రప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారన్నారు.

టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్‌ అమలు చేసిన పథకాలను నిర్వీర్యం చేసి ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. పేదల పథకాలను విస్మరించి టీడీపీ ప్రభుత్వం కార్పోరేట్‌ శక్తులకు అండగా నిలిచిందన్నారు. అర్హత లేని జన్మభూమి కమిటీల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, పచ్చచొక్కాల వారికే ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు అబద్దాలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అధికారం దక్కించుకుని ఆ తర్వాత ప్రజలను నట్టేట ముంచారన్నారు.

2050 నాటికి అత్యాధునిక హంగులతో రాజధాని నిర్మాణం చేస్తామని చెబుతున్న చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన ఐదేళ్లలో మూడేళ్లు పూర్తయిందని తెలిపారు. ఇంటికో ఉద్యోగం అన్నారే తప్ప ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. డ్వాక్రా,రైతు రుణాలు మాఫీ పేరుతో మహిళలు, రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. వంశధార,తోటపల్లి,ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టులు నిర్మించిన ఘనత వైఎస్‌దేనన్నారు. టీడీపీ ప్రాజెక్టులను నిర్మిస్తుందని గొప్పలు చెబుతున్నా రైతులు ఎవరూ చంద్రబాబును నమ్మరన్నారు.

నవనిర్మాణ దీక్షలతో ప్రజలకు ఒరిగేదేమీలేదని, ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందన్నారు. మడ్డువలస ప్రాజెక్టు పరిధిలో ఏడు నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు పునరావాసం కల్పించక అవస్థలు పడుతున్నారని, పట్టించుకునే నాధుడే లేడని, గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ సీపీ అభిమానులు, లబ్దిదారులకు కనీసం పెన్షన్లు, ఇళ్లు కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చేస్తున్నారని గీతనాపల్లి సర్పంచ్‌ నెయిగాపుల శివరామకృష్ణ సమస్యలను కృష్ణదాస్‌కు వివరించారు. టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, రానున్నది రాజన్నరాజ్యమేనని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సీఎం అవడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ సీసీ జిల్లా కార్యదర్శి ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, జలుమూరు మండల జెడ్పీటీసీ మెండ విజయశాంతి, మెండ రాంబాబు, జలుమూరు మండల వైసీపీ కన్వీనర్‌ ఎం.శ్యామలరావు, కొయ్యాన సూర్యారావు, మండల విప్‌ బుక్కా లక్ష్మణరావు, మల్లిఖార్జున చేనేత సంఘం అధ్యక్షుడు చల్లా సాంబశివరావు, వంగర మండల నేతలు పనస రమణనాయుడు, పొదిలాపు రామినాయుడు, నెయిగాపుల ప్రసాదరావు,జలుమూరు,వంగర మండలాలకు చెందిన పలువురు నాయకులు,సర్పంచ్‌లు పాల్గొన్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా