-

నేనేంటో చూపిస్తా !

4 Feb, 2016 14:23 IST|Sakshi
నేనేంటో చూపిస్తా !

కాపు ప్రజాప్రతినిధులపై కస్సుమన్న చంద్రబాబు
ఉద్యమాన్ని చల్లార్చకపోతే సహించేది లేదని హెచ్చరిక
తుని తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశం

 
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తునిలో కాపు ఐక్యగర్జన దరిమిలా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యం అటుతిరిగి ఇటుతిరిగి టీడీపీ ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకుంటోంది. గర్జనకు ఊహించని స్థాయిలో కాపు సామాజిక వర్గం సునామీ మాదిరి వెల్లువెత్తడం.. తదనంతర పరిణామాలతో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇరుకున పెడుతున్నాయి. ‘ఇంత జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నట్టు.. మీ నియోజకవర్గాల నుంచే ఎక్కువ స్థాయిలో కాపులు, నేతలు తరలివెళ్లారు. మనపై వ్యతిరేకతతో అంతమంది ఏకమవుతుంటే మీరేమీ చేయలేకపోయారా’ అని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు గట్టి క్లాస్ పీకారు.

తుని ఘటనల నేపథ్యంలో చంద్రబాబు జిల్లాలోని కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో మంగళవారం భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో చంద్రబాబు మాట్లాడారు.

‘నా హయాంలోనే ఎలాగోలా కాపు రిజర్వేషన్లు సాధించాలని యత్నిస్తున్నా. ఒక్క పూటలోనే అన్నీ జరిగిపోవు కదా. ఆ ఒక్క విషయాన్ని పట్టుకుని ఇంత అరాచకం చేస్తారా. ఇక నేను చూస్తూ ఊరుకోను. ఎంతటి వారినైనా అణచివేస్తా. నేనేంటో చూపిస్తా’  అని చంద్రబాబు నాయుడు ఆవేశంతో ఊగిపోయినట్టు తెలిసింది. ‘ఇప్పటివరకు మీరు ఏమీ చేయలేకపోయారు.. ఇకనైనా మీ నియోజకవర్గాల్లో కాపు నేతలను కంట్రోల్ చేయండి. మరోసారి రెచ్చిపోకుండా భయపెట్టండి’ అని టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం ఒకింత బెదిరింపు ధోరణితోనే మాట్లాడినట్టు చెబుతున్నారు.

మొత్తంగా కాపు ప్రజాప్రతినిధుల వద్ద కాపు సామాజికవర్గ నేతలపై చంద్రబాబు విరుచుకుపడినట్టు తెలిసింది. సీఎం వద్ద ఏమీ మాట్లాడకుండా తలాడించి వచ్చిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత మాత్రం ఒకరినొకరు ఓదార్చుకున్నారని అంటున్నారు. సీఎం వ్యాఖ్యలతో నొచ్చుకున్న ఎమ్మెల్యేలలో ఒకరు ‘కాపు ఐక్యగర్జన పరిణామాలను అంచనా వేయడంలో దారుణంగా విఫలమైన ఇంటెలిజెన్స్ వర్గాల  వారిని  అనాల్సిన మాటలు మనల్ని అంటే ఎట్లా’ అని సహచర ఎమ్మెల్యేలు, సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది.
 

మరిన్ని వార్తలు