చంద్రబాబు ముద్దాయి కాదు: సోమిరెడ్డి

1 Sep, 2016 03:15 IST|Sakshi
చంద్రబాబు ముద్దాయి కాదు: సోమిరెడ్డి

ఓటుకు నోటు కేసు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలోకి రాదు
ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్‌లో బాబు పేరు లేదు
న్యాయస్థానాలు రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి
దాసరికి బొగ్గుపై ఉన్న ప్రేమ కులంపై లేదు
చిరంజీవి కాపులైన ఏఒక్కరికీ న్యాయం చేయలేదు


అమరావతి: ఓటుకు నోటు కేసు ఎఫ్‌ఐఆర్‌లో గాని, చార్టిషీట్‌లో గాని ఎక్కడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేరు లేనప్పుడు ఏసీబీ న్యాయస్థానం విచారణకు ఎలా ఆదేశిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. న్యాయస్థానాలు కూడా రాజ్యంగానికి లోబడే పనిచేయాలని హితవు పలికారు. బుధవారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు ఎల క్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్ (ఎన్నికల్లో జరిగే అవకతవకలు)గా పరిగణించాల్సి ఉందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అవినీతి బయటపెట్టారనే కారణంతో రేవంత్‌రెడ్డిని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం సెక్షన్ 12 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించడం వెనుకు కుట్ర ఉందన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన సెక్షన్ 171 కింద ఈ కేసు నమోదు చేయాల్సిఉన్నా.. అలా చేయకుండా కుట్రతో టీడీపీ నేతలను తెలంగాణ ప్రభుత్వం ఇరికించిందన్నారు.

2014 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ నాయకులు రూ.18 లక్షలు తీసుకుని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వెళ్తుండగా పోలీసులకు పట్టుబడితే వారిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చిఉన్నారని తెలిపారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఎన్నికల సమయంలో నగదు దొరికితే సెక్షన్ 171 కింద నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఇలాంటి కేసులు నమోదు చేయించిందన్నారు. హైకోర్టులో ముత్తయ్య కేసు విషయంలో ఇచ్చిన జడ్జిమెంట్‌లో కూడా సాధారణ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందనే పరిగణించడమే కాక మిగిలిన నిందితులందరికీ అదే విధంగా వర్తిస్తుందని ఆదేశించిదన్నారు. ఈ కేసు హైకోర్టులో కొట్టేసినా టీఆర్ ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లిందని, అక్కడ పెండింగ్‌లో ఉండగానే ఏసీబీ కోర్టు విచారణకు ఎలా ఆదేశిస్తుందని సోమిరెడ్డి మండిపడ్డారు. ఏ న్యాయస్థాన మైనా పరిధి దాటి పనిచేయకూడదన్నారు.

ముద్రగడకు జాతికీ కులానికీ తేడా తెలియదు
జాతికి, కులానికి తేడా తెలియని ముద్రగడ పద్మనాభం కులచిచ్చు రేపుతున్నాడని సోమిరెడ్డి విమర్శించారు.దాసరి నారాయణరావు, చిరంజీవిలను చెరోపక్క కూర్చోపెట్టుకుని సమావేశాలు పెట్టి కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలకు పావుగా మారాడని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రిగా బొగ్గు కుంభకోణంలో కూరుకుపోయిన దాసరి నారాయణరావు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. ఆయనకు బొగ్గుపై ఉన్న ప్రేమ కులంపై లేదన్నారు. హీరోగా ఉన్న చిరంజీవి ఏనాడైనా కాపులకు న్యాయం చేశాడా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో కాపులకు జరిగిన న్యాయం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదన్నారు. కాపుల కోసం కమిషన్ ఏర్పాటుచేసి వెయ్యి కోట్లు నిధులు మంజారుచేశామని గుర్తుచేశారు.

>
మరిన్ని వార్తలు