'క్రెడిటే కాదు.. డెబిట్ కూడా చంద్రబాబుదే'

14 Jul, 2015 20:56 IST|Sakshi
'క్రెడిటే కాదు.. డెబిట్ కూడా చంద్రబాబుదే'

హైదరాబాద్: గోదావరి పుష్కరాలలో రాజమండ్రి పుష్కర ఘాట్ లో ఈ రోజు (మంగళవారం) ఉదయం సంభవించిన విషాదం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న దరిమిలా టీడీపీ మిత్రపక్షం బీజేపీ కూడా అదే భావనను సమర్థించింది. పదుల సంఖ్యలో మహిళల సహా 29 మంది దుర్మరణం చెందడాన్ని దురదృష్టకర ఘటనగా అభివర్ణించిన ఏపీ బీజేపీ నేత రఘునాథ బాబు.. సీఎం చంద్రబాబు తీరును తీవ్రంగా విమర్శించారు.

' పుష్కరాలకు పోతే పుణ్యం వస్తుందంటారు కానీ సీఎం చంద్రబాబు పాపం మూటగట్టుకున్నారు. లక్షలాది మంది భక్తులను గంటల తరబడి ఆపివేసి తాను మాత్రం పుష్కరస్నానం ఆచరించడం కచ్చితంగా పాపమే. అయినా వీఐపీ ఘాట్లు వదిలేసి సాధారణ భక్తులకోసం ఏర్పాలు చేసిన ఘాట్ కు ఎందుకు వచ్చినట్లు? అన్నీ గమనిస్తే అర్థమయ్యేది ఒకటే విషయం.. అన్నీ తానై పుష్కరాలను నిర్వహించాననే క్రెడిట్ కొట్టేయాలన్నది చంద్రబాబు ఉద్దేశం. ఆ క్రమంలోనే డెబిట్కు కూడా అంటే 29 మంది మరణాలకు కూడా ఆయనే బాధ్యత వహించాలి' అని రఘునాథ బాబు అన్నారు.

గతంలో ఎప్పుడూ భక్తి తత్పరతను ప్రదర్శించని చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా భక్తిపరుడిగా మారిపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో భక్తి ఉంటేగనక తెలంగాణ సీఎం కేసీఆర్ కే ఉందని, చాలాసార్లు ఆయన తన భక్తిని రుజువుచేసుకున్నారని రఘునాథ బాబు గుర్తుచేశారు. పుష్కరాల విషయంలో కనీసం ఒక డెలిగేషన్ లేదని,  ఏర్పాట్ల, నిర్వహణకు సరైన యంత్రాంగం అంతకన్నాలేదని, ఇది దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు