తమ్ముళ్లకు బాబు క్లాస్?

27 Oct, 2015 22:35 IST|Sakshi
తమ్ముళ్లకు బాబు క్లాస్?

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు అంక్షింతలు వేశారా..? ఆధిపత్య పోరుతో స్థాయిని మరిచి ఒకరిపై ఒకరు తిట్లదండకం అందుకుంటున్న నాయకులను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేశారా..? విజయవాడలో మంగళవారం టీ టీడీపీ నాయకులతో చంద్రబాబు జరిపిన సమావేశం వేడి వేడిగా కొనసాగిందని సమాచారం. సుమారు నాలుగైదు గంటలపాటు రెండు దఫాలుగా సమావేశం జరిగింది. ఈ భేటీకి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు.

భోజన విరామం వరకు అందరు నాయకులతో కలిపి సమావేశం జరిపిన బాబు అనంతరం రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకు ముందు పార్టీ నాయకుడు లోకేష్ కూడా వీరితో సమావేశమై చర్చించారు. పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్న వివరాల మేరకు.. రాష్ట్ర నాయకులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఎలా..? అంతా కలిసి ఉండండి. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నామన్న సంగతి మరిచిపోవద్దు. నాయకులు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి. మిమ్ముల్ని మీరు గౌరవించుకోకుంటే పార్టీ కేడర్ ఎలా మిమ్ముల్ని గౌరవిస్తుంది.. అని వీరికి క్లాస్ తీసుకున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి జరగాల్సిన కృషిపైనా వీరికి హితబోధ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని, సాధ్యమైనంత వరకు నేతలు అందరూ కలిసి వెళ్లాలని సూచించారు. జిహెచ్‌ఎంసిలో సైతం డివిజన్ల వారీగా సమావేశాలు జరపాలని, నారాయణ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగడం ఖాయం కాబట్టి ఆ ఎన్నికకు కూడా సిద్ధం కావాలని టీ టీడీపీ నేతలకు బాబు వివరించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీకి టికెట్ ఇవ్వమని మిత్రపక్షమైన బీజేపీ అడుగుతానని బాబు వీరికి హామీ ఇచ్చారు. అయితే, ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేసినా, ఎన్డీయే అభ్యర్ధిగా ఉంటారని, విజయం కోసం శ్రమించాలని వీరికి సూచించారు. మరో వైపు వరంగల్‌కు చెందిన పార్టీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్న అంశాన్నీ చంద్రబాబు ఆరా తీశారు. ఆమె పార్టీ మారడం వల్ల నష్టమేమీ ఉండదని తెలంగాణ నాయకులు బాబుకు సమాధానం చెప్పారని సమాచారం. వచ్చే నెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించాలని, ఆ సమావేశానికి తాను హాజరవుతానని బాబు చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీని పటిష్టం చేయడంపైనే దృష్టి పెట్టాలని వీరికి హిత బోధ చేశారు.

రేవంత్‌కు దొరకని అపాయింట్‌మెంట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం జరిగిన సమావేశంలో పార్టీ నాయకుల మధ్య జరిగిన గొడవ, నేతల మధ్య ఉన్న విభేదాలపై చంద్రబాబు అసహనం ప్రద ర్శించారని తెలిసింది. తెలంగాణ నాయకులంతా కలిసి పాల్గొనాల్సిన ఈ సమావేశానికి ముందే సోమవారం రేవంత్‌రెడ్డి విజయవాడకు చేరుకుని బాబు అపాయింట్‌మెంటు కోరారని, ఆయన నిరాకరించారని సమాచారం. మంగళవారం సమావేశానికి ముందు కూడా వ్యక్తిగతంగా ఒక్కడే కలిసే ప్రయత్నం చేసినా, ఎర్రబెల్లి, రమణలతో కలిసి రావాలని రేవంత్‌కు వెనక్కి పంపినట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురు నాయకులను కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నట్లు సమచారం. కాగా, బాబుతో జరిగిన సమావేశంలో తెలంగాణ అధ్యక్షుడు గడిచిన నెల రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలు, బంద్, ఢిల్లీ పర్యటన, ఆందోళన కార్యక్రమాల గురించి వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
 

మరిన్ని వార్తలు