ముఖ్యమంత్రి 'అక్రమ' నివాసం!

7 Sep, 2015 12:07 IST|Sakshi
కృష్ణానది ఒడ్డున సీఎం నివాసంగా మారిన లింగమనేని రమేష్ భవనం

సాక్షి, విజయవాడ బ్యూరో: రాజు తలచుకుంటే ఎలాంటి అక్రమమైనా నిమిషాల్లో సక్రమమైపోతుందనడానికి రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి నివాసానికి ఎంపిక చేసిన భవనమే నిదర్శనం. అక్రమంగా నిర్మించిన ఈ భవనాన్ని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని లింగమనేని ఎస్టేట్స్‌కు కొద్దిరోజుల క్రితం నోటీసు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే లింగమనేని గ్రూపునకు రెడ్ కార్పెట్ పరిచింది. అక్రమ భవనాన్నే అనధికారికంగా సీఎం నివాసానికి లీజుకు తీసుకుంది. అందులో మరమ్మతులు, సౌకర్యాలకు రూ.కోట్లు కుమ్మరిస్తోంది.

భవనాన్ని ఇచ్చిన లింగమనేని గ్రూపునకు నజరానాగా నాగార్జున యూనివర్సిటీ ఎదుట వారికే చెందిన రెయిన్ ట్రీ పార్కులో ఖాళీగా ఉన్న 500 ఫ్లాట్లను అధికారుల నివాసం కోసం అద్దెకు తీసుకొని భారీగా లబ్ది చేకూర్చనుంది. ఒక్కో ఫ్లాటుకు నెలకు రూ.40 వేలు అద్దె చెల్లించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి ఇటీవల రాజధాని ప్రాంతంలో ఖాళీ భవనాలను చూడడానికి వచ్చినప్పుడు కలెక్టర్ కాంతీలాల్ దండేతో కలిసి లింగమనేని రమేష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత లింగమనేని ప్రతినిధులు రెయిన్‌ట్రీ పార్కులో తమ ప్లాట్లను అధికారుల నివాసానికి పరిశీలించాలని కోరుతూ గుంటూరు కలెక్టర్‌కు ప్రజావాణిలో అధికారికంగా దరఖాస్తు చేశారు.

అక్రమంగా నిర్మించిన ఈ భవనాన్ని దీనికి ముందే సీఎం నివాసం కోసం గుంటూరు జిల్లా యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇందులోకి గృహప్రవేశం చేశారు. చంద్రబాబు ప్రస్తుతం ఈ భవనంలోనే బస చేశారు. దీంతో ఈ భవనం అక్రమ కట్టడం అనే విషయాన్నే అధికారులు మరచిపోయి లింగమనేని గ్రూపునకు వంగివంగి సలాములు చేస్తున్నారు.

నోరు మెదపని మంత్రి ఉమా
కృష్ణా నదికి ఆనుకొని ఉన్న 272/2, 271 సర్వే నెంబర్లలో లింగమనేని ఎస్టేట్స్ అధినేత రమేష్‌కు 1.31 ఎకరాల భూమి ఉంది. 2007 మే 10న ఈ భూమిలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి నీటిపారుదల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకున్నారు. కానీ, స్విమ్మింగ్ పూల్ పేరుతో జీ+1 భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత రెండో అంతస్తు కూడా వేశారు. చాలాకాలం దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొంతకాలం కిందట ప్రకటించారు. ఆ తర్వాత జలవనరుల శాఖ సర్వే చేసి ప్రకాశం బ్యారేజీకి ఎగువన 22 అక్రమ కట్టడాలున్నట్లు నిర్ధారించింది.

ఇందులో లింగమనేని రమేష్, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజులకు చెందిన భవనాలు, మంతెన సత్యనారాయణరాజుకు చెందిన ప్రకృతి ఆశ్రమం కట్టడాలున్నాయి. నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాలను ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ మార్చి 5న తేదీన తాడేపల్లి తహసీల్దార్ నోటీసులిచ్చారు. ఇంతలో ఏమైంతో తెలియదు కానీ ఇవన్నీ అక్రమ భవనాలంటూ రంకెలేసి విచారణకు అదేశించిన మంత్రి దేవినేని ఈ విషయం గురించే మాట్లాడడమే మానేశారు.

రైతుల భూముల్లో రోడ్డు
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల్లోనే ఒకదాంట్లో సీఎం నివాసం ఉంటుండడంతో నదీ పరిరక్షణ చట్టం తెల్లబోతోంది. ఏది అక్రమమని ప్రభుత్వం ప్రకటించిందో దాన్నే రూ.కోట్ల నిధులతో ఆధునికీకరించింది. ఇక్కడ ఎయిర్‌టెల్, వొడాఫోన్ మొబైల్ కంపెనీలు రెండు సెల్‌టవర్లను నిర్మించాయి. ఈ నివాసం కోసం రూ.3.30 కోట్లతో ప్రత్యేకంగా 33 కేవీ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భవనం వద్దకు వెళ్లడానికి లోటస్ ఫుడ్ సిటీ దగ్గరున్న పీడబ్ల్యూడీ వర్క్‌షాపు నుంచి 13 కిలోమీటర్ల కరకట్ట రోడ్డును ఆఘమేఘాల మీద నిర్మిస్తున్నారు.

ఈ కరకట్ట రోడ్డు నిర్మాణానికి గతంలోనే రూ.111 కోట్లు మంజూరుకాగా పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం సీఎం నివాసం కోసం ఈ నిధులతో రోడ్డును యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నారు. కరకట్ట మీద నుంచి సీఎం నివాసం లోపలికి వెళ్లే రోడ్డు పది అడుగులే ఉండడంతో దాన్ని 30 అడుగులకు విస్తరిస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు రైతుల భూములను భూసమీకరణ కింద ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేశారు. ఎలాంటి రాతపూర్వక పత్రాలు లేకుండానే వారి 12 సెంట్ల స్థలంలో రోడ్డు విస్తరించారు.

సీఎం నివాసానికి ప్రత్యేకంగా డ్రెయినేజీ వ్యవస్థను నిర్మిస్తున్నారు. భవనం మరమ్మతులతో సహా వీటన్నింటికీ కలిపి వివిధ శాఖల ద్వారా రూ.20 కోట్లకు పైగానే ఖర్చు చేయిస్తున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణంపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇక్కడే నివాసం ఉండడం ద్వారా కొంత అనుకూల వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో చంద్రబాబు లింగమనేని ఎస్టేట్‌ను ఎంచుకున్నట్లు తెలిసింది. కానీ, నదీ పరిరక్షణ చట్టాన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఉల్లంఘించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

పేదల ఇళ్లు అక్రమం, సీఎం ఇల్లు సక్రమమా?
'కృష్ణానది పరిరక్షణ చట్టం పేరుతో కరకట్టకు ఆనుకొని ఉన్న పేదల ఇళ్లను తొలగించారు. పేదలకు వర్తించే చట్టం, నిబంధనలు సీఎం నివాసానికి వర్తించవా? ముఖ్యమంత్రి నివాసం సక్రమమైతే పేదల ఇళ్లు కూడా సక్రమమే. అక్కడ తొలగించిన నివాసాలను మళ్లీ నిర్మించాలి. సీఎం కోసం చట్టానికే తూట్లు పొడవడం అన్యాయం'

- రాజధాని ప్రాంత సీపీఎం
సమన్వయ కమిటీ కన్వీనర్ బాబూరావు

మరిన్ని వార్తలు