చంద్రన్నా .. ఇదేం చికిత్స అన్నా!

19 Feb, 2017 22:18 IST|Sakshi
కాశినాయన :   పల్లెలంటే పచ్చని చెట్లు, వీనులవిందైనా పక్షుల రాగాలే కాదు బురద రోడ్లు,  విషజ్వరాలతో మంచం పట్టిన రోగులూ దర్శనమిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు వైద్యానికి వేలాది రూపాయలు ఖర్చు చేయలేక ఆందోళన చెందుతున్నారు. అయితే పల్లెల్లో వైద్య సేవల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన 104 చంద్రన్న సంచార చికిత్స సక్రమంగా అమలు కావడం లేదు. దీంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. 
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 104 వాహనానికి కష్టాలు మొదలయ్యాయని గ్రామీణ ప్రజలు చెబుతున్నారు. వాహనాల్లో మందులు, డాక్టర్లు లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖలో చలనం కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మారుమూల గ్రామీణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి 104 పేరుతో సంచార వైద్య సేవ వాహనాలను ప్రారంభించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడుస్తుంది. 
అందించాల్సిన సేవలు :
 బీపీ, షుగర్, ఉబ్బసం, మూర్చ, గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు సేవలు అందించాల్సి ఉంది. అలాగే మలేరియా, క్షయ, యూరిన్‌ పరీక్షలు, గర్భనిర్ధారణ, ఈసీజీ, బ్లడ్‌గ్రూపు, హీమోగ్లోబిన్‌ పరీక్షలు ఉచితంగా చేయాలి. కానీ 104 వాహనాల్లో పరీక్షల కిట్లు అందుబాటులో లేవు. ఒక్క బీపీ పరీక్ష చేయడం తప్ప మిగిలిన ఏ పరికరాలు అందుబాటులో ఉండటం లేదు. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుంటాయి. కనీసం ఈ వ్యాధులను నిర్ధారణ చేసే పరికరాలు కూడా లేకపోవడంతో పేదలు అప్పులు చేసి ప్రైవేటు వైద్యశాలలకు వెళుతున్నారు. 
మందుల కొరత :
 ప్రతి 104 వాహనంలో ఒక డాక్టర్, నర్సు, ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషీయన్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డు ఇలా ఆరుగురు సిబ్బంది ఉండాలి. అలాగే 50 రకాల మందులు అందుబాటులో ఉంచాలి. కానీ ప్రస్తుతం 15 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 
పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా :
 వాహనాల మెయింటినెన్స్‌ పేరుతో ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీకి ఒక వాహనానికి నెలకు రూ.2.50 లక్షలు చెల్లిస్తుంది. ప్రతి వాహనంలో డాక్టర్‌ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది. ఏజెన్సీ దీనిని పట్టించుకోవడం లేదు. దీంతో ఫార్మాసిస్టులే డాక్టర్ల అవతారమెత్తి పరీక్షలు, మందులు ఇస్తున్నారు. వైద్యసేవలు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంచార వాహనాల తీరును జిల్లా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.  ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సంచార వాహనంలో డాక్టర్‌తో పాటు అన్ని రకాల పరీక్షల కిట్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 

 

మరిన్ని వార్తలు