విజయా డెయిరీ సమావేశం రసాభాస

29 Sep, 2016 01:37 IST|Sakshi
విజయా డెయిరీ సమావేశం రసాభాస
 
  • ప్రైవేటు డెయిరీలకు అనుకూలంగా యాజమాన్యం 
  • సేకరణ ధరను పెంచకపోవడంతో తగ్గుతున్న పాలు
  • యాజమాన్యం తీరుపై విరుచుకుపడిన సొసైటీల అధ్యక్షులు
 
నెల్లూరు రూరల్‌ : విజయ డెయిరీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సొసైటీలు నిర్వీర్యమవుతున్నాయని పలువురు సొసైటీల అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరపురంలోని విజయ డెయిరీ ఆవరణంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. పలువురు సొసైటీల అధ్యక్షులు డెయిరీ ఎండీ కృష్ణమోహన్‌ తీరును తప్పుబట్టారు. ప్రైవేటు డెయిరీలతో ఒప్పందం చేసుకుని పాల సేకరణ ధరలను పెంచకపోవడంతో రైతులు పాలను ఇతర డెయిరీలకు పోస్తున్నారన్నారు. ఫలితంగా సొసైటీలు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుకు డిమాండ్‌ లేకపోయినా రూ.10 లక్షలు వెచ్చించి యంత్రాలను ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెప్పలేక ఎండీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఉద్యోగులు రైతులు పాలు పోయడంతోనే జీతాలు తీసుకుంటున్నామన్న విషయాన్ని మరిచిపోయి వారిని చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు, అధికారుల మధ్య వాగ్వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ చైర్మన్‌ గోపాలకృష్ణయ్య చౌదరి జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు.  
అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి: చిల్లకూరు సుధీర్‌రెడ్డి
 పాలకవర్గం చేస్తున్న అనవసర ఖర్చులతో డెయిరీకి లాభాలు తగ్గుతున్నాయని విజయ డెయిరీ మాజీ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర జిల్లాలో పాల సేకరణ ఖర్చు రూ.2 ఉంటే, జిల్లాలో రూ.7.12గా ఉందన్నారు. 180 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు ఉండగా, వారితో పని చేయించకుండా కాంట్రాక్టు కార్మికులను తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాల్లో గుంటూరుకు చెందిన సంగం డెయిరీ లీటరు పాలకు రూ.55.50 ఇస్తుండడంతో రైతులు అటు వైపు మెగ్గు చూపుతున్నారన్నారు. అధికారుల అలసత్వంతో డెయిరీలో దొంగలు పడి రూ.11.5 లక్షలను తీసుకెళ్లినా పాలకవర్గం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సుబేదారుపేటలోని ఆస్తులను వాస్తు పేరుతో ధారాదత్తం చేయడం ఏమిటని మండిపడ్డారు. కావలి సొసైటీ ఖాతాలో జమ చేయాల్సిన మొత్తాన్ని మేనేజర్‌ ఖాతాలో ఏలా వేస్తారని ప్రశ్నించారు. పాలకవర్గ సభ్యుల సిట్టింగ్‌ అలవెన్సులు, చైర్మన్‌ కారు, గౌరవవేతనం, ఇంటి అలవెన్సుల వివరాలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  
లాభాల బాటలో డెయిరీ:కొండ్రెడ్డి రంగారెడ్డి, చైర్మన్‌
 ప్రస్తుతం విజయ డెయిరీ లాభాల బాటలో నడుస్తోందని చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. పాలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని తెలిపారు. పశుపోషణను ప్రోత్సహించేందుకు పశువులకు దాణా, వ్యాధి నిరోధక టీకాలు, మందులు,  సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందజేస్తున్నట్లు వివరించారు. మేలు జాతి పశుసంపద కోసం విత్తన దున్నలను సైతం అందిస్తున్నామని తెలిపారు. 
మరిన్ని వార్తలు