దగా వైద్యం

16 Jan, 2017 23:38 IST|Sakshi
దగా వైద్యం
జిల్లాలో నకిలీ ఆయుర్వేద వైద్యులు
- దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తామని ప్రచారం
- అర్హత లేకపోయినా ప్రకటనలతో బురిడీ
- అనువంశిక, గిరిజన వైద్యం పేరిట మోసం
- నిలువు దోపిడీకి లోనవుతున్న రోగులు
 
ఆయుర్వేదం అక్రమార్కులకు వరంగా మారింది. ఈ వైద్యం పేరిట అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి అల్లోపతి మందులను ఆయుర్వేదం మందుల్లో కలిపి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో ప్రాణాలను హరిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని నియంత్రించే వ్యవస్థ బలంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది.
 
- కర్నూలు శివారులోని వీకర్‌ సెక్షన్‌కాలనీలో గతంలో ఓ వ్యక్తి అల్లోపతి మందులైన పెయిన్‌ కిల్లర్లను, స్టెరాయిడ్స్‌ను ఆయుర్వేద మందుల్లో కలిపి పలురకాల వ్యాధులు తగ్గిస్తామని జనానికి అంటగట్టారు. ఈ వ్యక్తిపై రెండేళ్ల క్రితం విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. 
- ఇటీవల నంద్యాల రోడ్డులోని శిల్పా సింగపూర్‌ టౌన్‌షిప్‌ సమీపంలోనూ శ్రీనివాసులు అనే వ్యక్తి మందులు తయారు చేస్తుండగా అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 
 
కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలోని బనగానపల్లిలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఉంది. ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 40 పైగా ఆయుర్వేద డిస్పెన్సరీలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వమే ఆయుర్వేద మందులను సరఫరా చేస్తోంది. కానీ ఈ ఆసుపత్రుల కంటే నకిలీ వైద్యులకే డిమాండ్‌ అధికంగా ఉంటోంది. దీర్ఘకాలిక వ్యాధులను, అల్లోపతి వైద్యానికి లొంగని వ్యాధులను మటుమాయం చేస్తామని నమ్మబలుకుతూ వీరిచ్చే ప్రకటనలను అమాయక ప్రజలు నమ్మి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఆయుర్వేదానికి సంబంధించి ఎలాంటి కోర్సులు చేయకపోయినా నిపుణులైన వైద్యులను తలదన్నేలా దర్జా కనబరుస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, బనగానపల్లి, ఆత్మకూరు, శ్రీశైలం, మహానంది, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, మంత్రాలయం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో నకిలీ ఆయుర్వేద వైద్యులు తిష్టవేసి తెలిసీ తెలియని వైద్యం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
 
పర్యవేక్షణ లేదు.. శిక్షలూ పడవు
ఆయుర్వేద వైద్యం చేయాలంటే బీఏఎంఎస్‌ కోర్సు తప్పనిసరి. కానీ కొంత మంది దూరవిద్య ద్వారా డిప్లమా సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. మరికొందరు అనువంశిక వైద్యమని, గిరిజన వైద్యమని చెబుతూ జనాన్ని మభ్యపెడుతున్నారు. ఏ మాత్రం అక్షరజ్ఞానం లేని వారు సైతం వైద్యులుగా చెలామణి అవుతున్నారు. చివరికి రహదారి పక్కన మూలికలు నూరిపోసి జనానికి ఇస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. ఆయుర్వేద మందులను విక్రయించాలన్నా, వాటిని తయారు చేయాలన్నా ఆయుష్‌ విభాగం నుంచి అనుమతి పొందాలి. వీరు ఏ మందులు విక్రయిస్తున్నారు, ఎలాంటి మందులు తయారు చేస్తున్నారో అధికారులు పర్యవేక్షించాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మందులను తనిఖీ చేసేందుకు కేవలం ఇద్దరు మాత్రమే డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. దీంతో వీరు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించవు. విజిలెన్స్‌ అధికారులు అడపాదడపా దాడులు చేసి పట్టుకుని, పోలీసులకు అప్పగించినా పెద్దగా శిక్షలు పడవు. నకిలీ మందులు వాడి కొన్ని వేల మంది ఇప్పటికే కిడ్నీ, కాలేయం వ్యాధులతో బాధపడుతున్నారు. మరికొందరు అనారోగ్యంతో కన్నుమూశారు. కానీ అక్రమార్కులకు ఎలాంటి కఠిన శిక్షలూ పడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయుర్వేద మందులు విక్రయించే వారిపై పర్యవేక్షణ చేసే అధికారం ఇటు ఆయుష్‌ విభాగ అధికారులకు గానీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు, ఔషధ నియంత్రణ శాఖకు  ఉండటం లేదు. దీంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు.
 
తనిఖీలు చేసే అధికారం మాకు లేదు
జిల్లాలో అనేక మంది నకిలీ ఆయుర్వేద వైద్యులున్నట్లు మా దృష్టికి కూడా వస్తోంది. కానీ అలాంటి వారిపై తనిఖీలు చేసి, శిక్షించే అధికారం మాకు లేదు. నకిలీ వైద్యులు విక్రయించే మందుల వల్ల అనేక మంది అనారోగ్యానికి లోనవుతున్నారు. కిడ్నీలు పాడై డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు కొన్ని వేల మంది ఉన్నారు. ఆయుర్వేదం ఒక అద్భుత వైద్యం. ప్రజలు నిపుణులైన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స చేయించుకోవాలి.
– డాక్టర్‌ పి.వి.నాగరాజరావు, సీనియర్‌ ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌
 
మరిన్ని వార్తలు