మోసగాడు అరెస్ట్‌

20 Aug, 2016 00:50 IST|Sakshi
– పెళ్లిచేసుకుని కట్నకానుకలతో విదేశాలకు ఉడాయించిన ఘనుడు
– బాధితురాలు విన్నపంతో చొరవ తీసుకున్న ఎస్పీ
– రెడ్‌కార్నర్‌ నోటీస్‌తో పట్టుబడిన నిందితుడి
 
వెల్దుర్తి రూరల్‌: పెళ్లి చేసుకుని భార్యను వదిలేసి కట్నకానుకలతో ఉడాయించిన మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వేధింపుల కేసు నుంచి తప్పించుకునేందుకు నాలుగేళ్లుగా విదేశాల్లో ఉంటున్న నిందితుడిని వెల్దుర్తి పోలీసులు బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేశారు. వెల్దుర్తి మండలం ఎల్‌ నగరానికి చెందిన రాధికకు హైదరాబాద్‌లో స్థిరపడి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న నెల్లూరి వాసి శ్రీధర్‌రెడ్డితో 2010లో వివాహమైంది. కట్నకానుకల కింద రూ.15 లక్షలు, 25 తులాల బంగారం అందజేశారు. భార్యకు వీసా వచ్చిన వెంటనే తీసుకెళ్తానని నమ్మించి వివాహమైన 15 రోజుల తర్వాత కట్నకానుకలతో ఉడాయించాడు. కొన్నాళ్లు అత్తమామల వద్ద ఉన్న రాధికను నిత్యం వేధించారు. భర్త కూడా అదనపు కట్నం తేవాలని ఒత్తిడి తెచ్చాడు. వేధింపులు భరించలేని రాధిక పుట్టింటికి చేరుకుంది. భర్త, అత్తమామలు వేధిస్తున్నారని 2012లో వెల్దుర్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అదుబాటులో ఉన్న శ్రీధర్‌రెడ్డి తల్లిదండ్రులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరుచగా జడ్జి శిక్ష విధించారు. ఇదే కేసులో ప్రథమ నిందితుడైన శ్రీధర్‌రెడ్డి నాలుగేళ్లుగా విదేశాల్లో ఉంటూ తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితురాలు విషయం ఎస్పీ ఆకే రవికష్ణ దష్టికి వెళ్లగా ఆయన రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేశారు. కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ సైతం జారీ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే ప్రయత్నంలో నిందితుడు ఈనెల 18న చాకచక్యంగా ఆస్ట్రేలియా నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అయితే రెడ్‌కార్నర్‌ నోటీసు ఉండడంతో ఎయిర్‌పోర్టు అధికారులు విచారించి వెలుర్తి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎఎస్‌ఐ నజీర్‌ బాషా, పోలీసులు విష్ణు, చంద్రమౌళిలు వెంటనే బెంగళూరు చేరుకుని శ్రీధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి డోన్‌ మెజిస్ట్రేటు ఎదుట హాజరు పరచగా నిందితుడు పాస్‌పోర్ట్‌ స్వాధీన పరుచుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ రిమాండు విధించారు. మరో మహిళకు ఇలా జరుగకుండా ఎస్పీ తీసుకున్న చొరవకు రాధిక తల్లిదండ్రులు శుక్రవారం కతజ్ఞతలు తెలిపారు.    
 
మరిన్ని వార్తలు