మోసగాళ్లు వచ్చేశారు..

10 Jun, 2017 04:19 IST|Sakshi
మోసగాళ్లు వచ్చేశారు..

మహారాష్ట్ర నుంచి దళారుల రంగప్రవేశం
అనుమతి లేని బీటీ–3 రకం పత్తి విత్తనాల విక్రయాలు
కలుపు మందులు అవసరం  లేదంటూ ప్రచారం
ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.1,600
మోసపోవద్దంటున్న వ్యవసాయశాఖ అధికారులు

భూపాలపల్లి: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే రైతన్నకు మోసగాళ్ల బెడద మొదలైంది. అమాయక రైతులే లక్ష్యంగా కొందరు అనుమతి లేని పత్తి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన కొందరు వ్యక్తులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ బోల్‌గార్డ్‌(బీటీ) 3 విత్తనాలను విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలను నాటితే కలుపు మందులు అవసరం లేదంటూ ప్రచారం చేస్తూ రైతులను ముంచేందుకు యత్నిస్తున్నారు.

బీటీ–2కే అనుమతి
గత ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాల మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది సైతం అదే పరిస్థితి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన కొందరు జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, కాటారం, మహదేవ్‌పూర్‌ మండలాలతో పాటు ములుగు డివిజన్‌లోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు.

రాష్ట్రంలో బీటీ–2 రకం పత్తి విత్తనాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. కాగా అనుమతి లేని బీటీ–3 విత్తనాలు మేలైనవని దళారులు రైతులను నమ్మబలుకుతున్నారు. ఈ విత్తనాలు నాటితే కలుపు మందులు కొట్టాల్సిన అవసరం లేదని, దిగుబడి ఎక్కువగా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన బీటీ –2 పత్తి విత్తనాల ప్యాకెట్‌ ధర రూ.800 వరకు ఉండగా దళారులు నకిలీ విత్తనాలను రూ.1,200 నుంచి రూ.1,600 వరకు వి క్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. విత్తన ప్యాకెట్ల విక్రయాల కోసం దళారులు కమీషన్‌ పద్ధతిన స్థానికులను కొందరిని నియమించుకుని ఈ దందా సాగిస్తున్నట్లు తెలిసింది.


లైసెన్స్‌ లేకుండానే..
బీటీ 3 పేరిట విత్తనాలు విక్రయించే వారితో పాటు మరికొందరు గ్రామాల్లో తిరుగుతూ ఇతర రకాల నకిలీ విత్తనాలు వి క్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఫర్టిలైజర్, విత్తన విక్రయ దుకా ణాలు ఏర్పాటు చేసుకోకుండా, లైసెన్సులు పొందకుండా విత్తన విక్రయాలు జరుపుతున్నారు. పలువురు దళారులు తెల్ల సంచుల్లో విత్తనాలను విక్రయిస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు విక్రయించే వారు రైతులకు రశీదులు ఇవ్వడం లేదు. కనీసం దుకాణాల అడ్రస్‌ కూడా సరిగా తెలియజేయడం లేదని తెలిసింది. లైసెన్స్‌ లేని వారి వద్ద, ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు కొనుగోలు చేయడం మూలంగా విత్తనం మొలకెత్తకపోయినా, పంట దిగుబడి రా కున్నా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

మా దృష్టికి వచ్చింది..
భూపాలపల్లి డివిజన్‌ పరిధిలో కొందరు వ్యక్తులు బీటీ–3 పేరిట పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. బీటీ–3కి ప్రభుత్వం అనుమతి లేదు. అలాంటి విత్తనాలను రైతులు కొనుగోలు చేసి మోసపోవద్దు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదు, విత్తన ప్యాకెట్‌ కవర్‌ను పంట దిగుబడి వచ్చే వరకు దాచి ఉంచాలి. బీటీ–3 విత్తనాలు విక్రయించే వారి సమాచారం అందిస్తే తగు చర్యలు తీసుకుంటాం.
– సత్యంబాబు, ఏడీఏ, భూపాలపల్లి
 

మరిన్ని వార్తలు