-

భువనచంద్ర చెక్‌డ్యాం నిర్మాణాన్ని నిలిపివేయాలి

22 Feb, 2016 02:33 IST|Sakshi
భువనచంద్ర చెక్‌డ్యాం నిర్మాణాన్ని నిలిపివేయాలి

నిర్వాసితుల డిమాండ్
స్పీకర్, మంత్రిని అడ్డుకున్న రైతులు, మహిళలు

 
 రాజుపాలెం: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో భువనచంద్ర చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు నిర్వాసితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ చెక్‌డ్యాం నిర్మాణాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. చెక్‌డ్యాం వల్ల భూములను కోల్పోతున్న రైతులు, మహిళలు శంకుస్థాపన పనులను శనివారం అడ్డుకున్నారు. శంకుస్థాపనకు ఉపయోగించిన పూజా సామాగ్రి, రాళ్లను బయటకు విసిరేశారు. బలిజేపల్లికి చెందిన నిర్వాసితులు, మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం, తోపులాట చోటుచేసుకున్నాయి.

నిర్వాసితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రాణాలు పోయినా ఇక్కడ చెక్‌డ్యాం కట్టడానికి ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. రైతులు, మహిళలను పోలీసులు చెదరగొట్టారు. చివరకు పోలీసు బందోబస్తు మధ్య స్పీకర్ కోడెల, మంత్రి ఉమా.. భువనచంద్ర చెక్‌డ్యాంకు శంకుస్థాపన చేశారు. నిర్వాసిత రైతులతో స్పీకర్ కోడెల మాట్లాడారు. చెక్‌డ్యాం వల్ల భూములు మునిగిపోతే, తామంతా బజారున పడుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెక్‌డ్యాంతో తమ గ్రామానికి ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. న్యాయం చేస్తానంటూ స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వాసితులు అడ్డుకుంటారని తెలుసుకున్న అధికారులు బలిజేపల్లి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని గణపవరంలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు.

మరిన్ని వార్తలు