హక్కుల వినియోగంతోనే మోసాలకు చెక్‌

29 Dec, 2016 21:21 IST|Sakshi
హక్కుల వినియోగంతోనే మోసాలకు చెక్‌
- వినియోగదారుల సంఘాల పటిష్టతకు చర్యలు   
- పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పిలుపు 
- కర్నూలులో జాతీయ వినియోగదారుల రాష్ట్రస్థాయి వేడుకలు 
 
కర్నూలు(అగ్రికల్చర్‌) : గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు వినియోగదారుల సంఘాలను పటిష్టం చేసి వినియోగదారుల సంక్షేమానికి మరింతగా కృషి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. గురువారం కర్నూలులో జాతీయ వినియోగదారుల దినోత్సవం రాష్ట్రస్థాయి వేడుకలు కనులపండువగా జరిగాయి.  జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వినియోగదారులు ఎక్కడెక్కడ ఏ విధంగా మోసపోతున్నారు, కార్బైడ్‌తో మాగించిన, సహజసిద్ధంగా మాగిన పండ్ల తేడాలు, మందుల్లో నకిలీలను గుర్తించే విధానం, తూకాలు, కొలతల్లో అక్రమాలు, కల్తీ విత్తనాలు, ఎరువులను గుర్తించడం తదితర వాటికి సంబంధించి అవగాహన కోసం  సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వీటిని అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకంగా  పరిశీలించారు. రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారులు, ఇతర ప్రముఖులు స్టాళ్లను పరిశీలించారు. అంతకుముందు కర్నూలులో జూట్‌ బ్యాగుల తయారీ కేంద్రాలను మంత్రి, అధికారులు పరిశీలించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో సునీత మాట్లాడుతూ వినియోగదారులు ఏ రూపంలోనూ మోసపోకుండా ఉండాలంటే ముందుగా అందుకు సంబంధించి చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎలాంటి వస్తువును కొనుగోలు చేసినా విధిగా బిల్లు తీసుకోవాలన్నారు. నాణ్యత లేకపోతే వినియోగదారుల ఫోరం ద్వారా నష్టపరిహారాన్ని పొందవచ్చని వివరించారు. గ్యాస్‌ పంపిణీలో మోసపోకుండా వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
హక్కుల పరిరక్షణకు కృషి .. 
 రాష్ట్ర వినియోగదారుల ఫోరం జడ్జి జస్టిస్‌ నౌషద్‌ అలీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ఫోరం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వినియోగదారుల కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.  పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌ రవిబాబు మాట్లాడుతూ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ ఏడాది కర్నూలులో నిర్వహించడం సంతోషదాయకమన్నారు.  రాష్ట్రంలో 1.34 కోట్ల మంది కార్డుదారులున్నారని, వీరందరూ ప్రభుత్వ వినియోగదారులని తెలిపారు. వీరికి ఇచ్చే సరుకుల్లో ఎక్కడా దగాకు తావు లేకుండా ఈ-పాస్‌ మిషన్లు ఏర్పాటు చేసి బయోమెట్రిక్‌ ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో స్టేట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు. వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం రావాలని తెలిపారు. 
 
వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత
సామాన్య కూలీ మొదలు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని, వీరి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ లింగారెడ్డి అన్నారు. వీరితో పాటు జంతువులు, పక్షులు కూడా వినియోగదారుల కిందికే వస్తాయని, గాలి, వాతావరణం కలుషితం అవుతుండటం వల్ల ఇవి కూడా దెబ్బతింట్నునాయని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీపై చర్యలు తీసుకునేందుకు స్థానిక సంస్థలకు సర్వాధికారాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు, రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్వరరావు, జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ తదితరులు ప్రసంగించారు.  కేవీఆర్‌ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన 'వినియోగదారుడా... మేలుకో' నాటకం ఆకట్టుకుంది. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌ రవిబాబు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ రామ్మోహన్, డీఎస్‌ఓ శశిదేవి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ కృష్ణారెడ్డి, జిల్లా వినియోగదారుల సేవా కేంద్రం ఇన్‌చార్జి నదీం హుసేన్, జిల్లా వినియోగదారుల రక్షణమండలి అధ్యక్ష, కార్యదర్శులు మద్దిలేటి, శివమోహన్‌రెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీటీసీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు