నిబంధనలకు నీళ్లు.. నిధులకు కాళ్లు

2 Oct, 2016 23:07 IST|Sakshi
నిబంధనలకు నీళ్లు.. నిధులకు కాళ్లు
  • చెరువు పనుల్లో దోపిడీకి ‘తమ్ముళ్ల’ పథకం
  • వత్తాసు పలుకుతున్న రాజానగరం ముఖ్యనేత
  • ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోని అధికారులు
  •  
    అందినంతా దోచుకో అయినకాడికి దాచుకో అన్నట్టుగా ఉంది జిల్లాలో అధికార పార్టీ నేతల తీరు. ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని అడిగే వాడుండనే ధైర్యంతో నేతలు బరితెగిస్తున్నారు. ఒక పథకంలో చేసిన పనినే మరో పథకంలో చేపట్టి దండిగా దండుకునేందుకు రంగం సిద్ధం చేశారు. రాజానగరం నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత అండతో అతని అనుచరగణం రూ.లక్షలు నొక్కేసే ప్లాన్‌ వేశారు. 
     
    సాక్షిప్రతినిధి, కాకినాడ : 
    రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, సీతానగరం మండలాల్లో చెరువులను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కోరుకొండ మండలంలో చేపట్టిన నీరు–చెట్టు పథకం చెరువుల తవ్వకాల్లో అవినీతి జరిగిందని ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునేటంతటి ధైర్యం అధికారులు చేయలేని పరిస్థితి. నీరు–చెట్టు పథకంలో పనులను పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్, పార్టిసిపేషన్‌) పద్ధతిలో చేట్టాలి. అలా చేయలేదు సరికదా, జాతీయ ఉపాధి హామీ పథకంలో చేసిన పనులను కూడా ‘నీరు–చెట్టు’ పథకంలో చేసినట్టు చూపించారు. పరిశీలనతో నిమిత్తం లేకుండా తమ వాళ్లు చేసే పనులకు బిల్లులు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి ద్వారా నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత అ«ధికారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. కోరుకొండ మండలం మునగాలలో నాగబుచ్చన్న చెరువు, శ్రీరంగపట్నం కొత్త కాల్వను ఉపాధి హామీ పథకంలో తవ్వారనే విమర్శలున్నాయి. అవే చెరువులను తిరిగి నీరు–చెట్టు పథకంలో మరోసారి చూపిస్తున్నారంటున్నారు. కృష్ణమాచారి చెరువు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ఆయకట్టు 466 ఎకరాలు ఉంది. మునగాలలోని నాగబుచ్చన్న చెరువు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ఆయకట్టు 103 ఎకరాలు ఉంది. ఈ చెరువును రూ. 6.77 లక్షలు, కృష్ణమాచారి చెరువును రూ.9.85 లక్షలు, శ్రీరంగపట్నంలోని కొత్త కాల్వకు రూ.1.48 లక్షలతో నీరు–చెట్టు పథకంలో పనులు చే పట్టారు. వీటిలో మునగాలలోని నాగబుచ్చన్న చెరువు పనులను గతంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో కూడా చేపట్టామని అధికారులే అంగీకరించడం విశేషం.
     
    నామినేషన్‌ వర్కులతో రూ.లక్షలు స్వాహా!
    నీరు–చెట్టు పథకంలో టెండరును నామినేషన్‌ వర్కుగా విభజించి కోరుకొండ మండలానికి చెందిన అధికార పార్టీ పెద్దలు రూ.లక్షలు ఆర్జించారనే విమర్శలున్నాయి.S పీపీపీ పద్ధతిలో పనులు చేసేందుకు ముందుకు వచ్చిన వారిని కాదని అ«ధికారికంగా పనులు చేస్తున్నట్టుగా చూపిస్తూ ఈ చెరువుల నుంచి తీసిన మట్టిని రియల్‌ ఎస్టేట్, ఇటుక బట్టీల వ్యాపారులకు తెగనమ్ముకుని సొమ్ములు చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. పీపీపీ పద్ధతిలో 30 శాతం సామాజిక అవసరాలకు ఉపయోగించగా మిగిలిన 70 శాతం మట్టిని క్యూబిక్‌ మీటరు రూ.29కి రైతులకు విక్రయించవలసి ఉంది. కానీ ఆ ధరకు పది రెట్లు పెంచేసి ఆ మూడు చెరువుల్లో సుమారు రూ.కోటిన్నర విలువైన మట్టిని రియల్‌ ఎస్టేట్, ఇటుక బట్టీల వ్యాపారులకు అమ్ముకున్నారనే విమర్శలున్నాయి.
     
    క్వాలిటీ, విజిలెన్స్‌ అధికారుల చోద్యం
    ఈ చెరువుల్లో జరిగిన అవినీతిపై గత మే నెలలో క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కంగారు పడిన అధికారులు గత జూలైలో కోరుకొండ మండలంలో చేపట్టిన పనులకు సంబంధించి ఇటీవలనే ఫైనల్‌ లెవెల్స్‌ తీశారు. అప్పటికే వర్షపు నీటితో నిండిపోయిన కృష్ణమాచారి చెరువులో ప్రమాదవశాత్తు పడి  కాండ్రేగుల నాగేశ్వరరావు అనే ఉపాధి కూలీ మృత్యువాత పడ్డాడు. ఈ చెరువులలో చేపట్టిన అభివృద్ధి పనులపై సంబంధిత ఆయకట్టు రైతులతో కనీసం సంప్రదించకుండా అధికార పార్టీ వారే ఉండే జన్మభూమి కమిటీల సూచనలతో రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు కోరిన పనులు ఇస్తూ ప్రజలు కోరుకున్న రాఘవాపురం, నారా ఎరకమ్మ చెరువు పనులను తిరస్కరించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పథకంలో చేసే పనులకు క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్‌ అధికారుల సమక్షంలో ప్రీ లెవిల్స్, ఫైనల్‌ లెవెల్స్‌ నమోదు చేసి క్రాస్‌ తీయవలసి ఉంది. కాని ఎక్కడా లెవెల్స్‌ తీసి నమోదు చేసిన దాఖలాలు లేవు. ఈ విషయంలో క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. 
     
    37 పనుల్లో అవినీతి జరిగింది
    నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం ద్వారా చేపట్టిన 37 పనుల్లో అవినీతి జరిగింది. విచారణ జరిపితే అనేక అవకతవకలు బయటికొస్తాయి. ఈ అవినీతికి స్థానిక ఎమ్మెల్యే అండదండలున్నాయి. కొంతమంది అధికారులు కూడా కుమ్మక్కయ్యారు. టీడీపీ నేతలు రైతుల పేరున పనులు తీసుకోవడమే కాకుండా తీసిన మట్టి అమ్ముకుని రూ.లక్షలు వెనకేసుకున్నారు.
     – జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్, రాజానగరం నియోజకవర్గం
     
     
     
     
మరిన్ని వార్తలు