మీ కంటే మందు బాబులే మేలు

16 Dec, 2016 01:23 IST|Sakshi
మీ కంటే మందు బాబులే మేలు

ఐఏఎస్‌లపై సీఎం వ్యాఖ్యలు
శాఖాధిపతులతో సీఎం సమీక్ష
మీ మైండ్‌ సెట్‌ మారాలంటూ చంద్రబాబు క్లాస్‌


సాక్షి, అమరావతి: ఎవరూ ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకోరు... మురికివాడల్లో పుడితే మురికి ఆలోచనలే వస్తాయి... కొడుకును కంటానంటే ఏ అత్తయినా వద్దంటుందా?... అంటూ గతంలో  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తాజాగా ‘మీ కంటే మందు బాబులే బెటర్‌’ అంటూ ఐఏఎస్‌ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆయన గురువారం సచివాలయంలో వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్, సేవలు వంటి వివిధ రంగాలపై శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు,  సీఆర్‌డీఏ కమిషనర్‌  శ్రీధర్‌ వంటి అధికారుల నుంచి ఆయా శాఖలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 ఈ నేపథ్యంలోనే నోట్ల రద్దుపై జరిగిన చర్చలో నగదు రహిత లావాదేవీలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు.   మీలో ఎంతమంది నగదు రహిత వ్యవహారాలు నిర్వహిస్తున్నారో చేతులు ఎత్తాలంటూ ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్నవారిలో 20 శాతం మంది మాత్రమే  చేతులు ఎత్తడంతో... మీ కంటే మందు బాబులే బెటర్‌. చేతిలో నగదు లేనందున కార్డుల వినియోగం నేర్చుకోకపోతే సాయంత్రానికి కిక్‌ ఎక్కదు. అందుకే వారు  నగదు రహిత లావాదేవీలవైపు మళ్లారు. ఆన్‌లైన్, స్వైపింగ్‌ మెషీన్ల వినియోగాన్ని నేర్చుకున్నారు. మీరు కూడా మైండ్‌ సెట్‌ మార్చుకోవాలి. మీరే నగదు రహిత లావాదేవీలు చేయకపోతే ప్రజలకేం నేర్పుతారు?’ అని సీఎం వ్యాఖ్యానించారు.

మీడియా లైవ్‌ నెట్‌ వర్క్‌ ఏర్పాటు
సచివాలయంలో మీడియాలైవ్‌ నెట్‌ వర్క్‌ను ఏర్పాటు చేశారు. బ్లాక్‌ –1లోని సీఎంలో జరిగిన హెచ్‌ఓడీ సమావేశాన్ని బ్లాక్‌–4లో ఏర్పాటు చేసిన పబ్లిసిటీ సెల్‌కు లైవ్‌ బ్రాడ్‌ కాస్ట్‌ చేయడంతో ఆ వివరాలను మీడియా సేకరించుకునే అవకాశం ఏర్పడింది.

సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల ఆవేదన...
ముఖ్యమంత్రి తమను మందుబాబులతో పోల్చడంపై సమావేశం తరువాత కొందరు ఐఏఎస్‌లు ఆవేదనతో చర్చించుకోవడం కనిపించింది. చివరకు మా దుస్థితి ఇలా తయారైందంటూ సన్నిహితులకు తెలియజేస్తూ కొందరు వాపోయారు. జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదని ముఖ్యమంత్రి ఎన్నోసార్లు చెప్పారు... మరి ఆయన ఏ వ్యాలెట్‌ అయినా వాడుతున్నారా? అని ఒక ఉన్నతాధికారి ప్రశ్నించగా..  ప్రతిదీ ప్రభుత్వమే భరించేట ప్పుడు ఆయనకు జేబులో డబ్బులు ఎందుకు? అని మరో అధికారి వ్యాఖ్యానిం చారు. ఆయన వెంట ఉండేది కోట్లున్న , కోట్లు తొడిగిన వారే కదా, ఆయనకు డబ్బెందుకు? వ్యాలెట్‌ ఎందుకు? అని మరో అధికారి అన్నారు. ఇకపై మనం మీటింగులకు వెళ్లేప్పుడు చెవుల్లో దూది పెట్టుకుని వెళితే సరి... అని మరో ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం విశేషం.