చిన్నారి ప్రాణం పోయింది

17 Aug, 2016 00:05 IST|Sakshi
చిన్నారి ప్రాణం పోయింది

గుంతకల్లు టౌన్‌ : చికిత్స కోసం వెళితే చిన్నారి ప్రాణమే పోయింది. ఇంజెక్షన్‌ వేసిన కొన్ని నిమిషాలకే కన్ను మూసింది. తమ చేతుల మీదే గిలగిలాకొట్టుకుంటూ పాప చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.డాక్టర్‌ నిర్లక్ష్యం వల్లే  ఇలా జరిగిందంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు.             

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన సురేష్, సులోచన దంపతుల రెండో కుమార్తె జ్యోతి(11నెలలు)కి సోమవారం రాత్రి నుంచి తీవ్రమైన జ్వరం వచ్చింది. మంగళవారం ఉదయం చిన్నారిని వైద్యం నిమిత్తం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని టి.బి.రోడ్‌లోని అరుణ్‌ క్లినిక్‌లో చిన్న పిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ వీరేష్‌కుమార్‌ను సంప్రదించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యుడు పాపకు ఇంజెక్షన్‌ వేశాక రక్తపరీక్షలకు సిఫార్సు చేశారు. ల్యాబ్‌కు తీసుకెళ్లగానే పాప పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించుకుంటూ వైద్యుడి వద్దకు వచ్చారు. ఇంజెక్షన్‌ వికటించే తమ పాప మరణించిందని, మెరుగైన వైద్యం చేసి ఉంటే బతికి ఉండేదని వాగ్వాదానికి దిగారు.

రోడ్డుపై ధర్నా
కేవీపీఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు జగ్గిలి రమేష్, కార్యదర్శి వై.శ్రీనివాసులు, రాయలసీమ దళిత సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, ఎమ్మార్పీఎస్‌ రాయలసీమ కార్యదర్శి స్వామిదాస్‌ తదితరులు చిన్నారి జ్యోతి మరణానికి కారణమైన డాక్టర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని క్లినిక్‌ ఎదుట రోడ్డుపై మృతదేహంతో ధర్నాకు దిగారు. సీఐ గురునాథబాబు, ఎస్‌ఐ నగేష్‌బాబులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులు, వైద్యుడిని ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేçÙన్‌కు తీసుకెళ్లారు. పట్టణంలోని వైద్యులు కూడా స్టేషన్‌కు వచ్చారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన డాక్టర్‌పై కేసు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పాప తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు కోరారు.  

ఏ విచారణకైనా సిద్ధమే
జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని పరీక్షించి జ్వరం నయం కావడానికి తగిన మోతాదు మేరకు ఇంజెక్షన్‌ వేశాను. పాప యాక్టివ్‌గా లేని కారణంగా రక్త పరీక్షలు చేయించుకువస్తే ఆ రిపోర్ట్‌ చూసి తదుపరి మెరుగైన వైద్యం చేస్తానని చెప్పాను. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు ఉన్నాం కానీ ప్రాణాలు తీసేందుకు కాదు. నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే.
– డాక్టర్‌ వీరేష్‌కుమార్, చిన్నపిల్లల వైద్యనిపుణుడు

మరిన్ని వార్తలు