ఇంజక‌్షన్‌ వికటించి చిన్నారి మృతి

22 Jul, 2017 22:48 IST|Sakshi

ఆర్‌ఎంపీ నిర్లక్ష్యం వల్లేనంటూ బాధితుల ఆందోళన
గోరంట్ల(సోమందేపల్లి) : గోరంట్ల పట్టణంలో ఆర్‌ఎంపీ వేసిన ఇంజక‌్షన్‌ వికటించి చిన్నారి మృతి చెందినట్లు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. బూగానిపల్లికి చెందిన రాధమ్మ, శంకర దంపతులు తమ కుమార్తె శ్రావణి (3)కి జ్వరం వస్తుండటంతో గోరంట్లలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఆర్‌ఎంపీ పెద్దన్న ఇంజక‌్షన్‌ వేసి పంపించాడు. స్వగ్రామానికి చేరుకున్న కొద్దిసేపటికే చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో తల్లిదండ్రులు వెంటనే క్లినిక్‌కు వెళ్లారు. తమ చేతకాదని, హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లండని ఆర్‌ఎంపీ సలహా ఇచ్చాడు.

అయితే అప్పటికే శ్రావణి మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు క్లినిక్‌ ముందు ధర్నాకు దిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. తనవద్దకు వచ్చే వారికి డోస్‌ ఎక్కువగా ఉండే మందులు, ఇంజక‌్షన్లు ఇస్తుంటారని ఆర్‌ఎంపీపై ఆరోపణలు ఉన్నాయి. చిన్నారి మృతిపై కొందరు పెద్దమనుషులు జోక్యం చేసుకుని పంచాయితీ చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు