కర్కశం..

21 Apr, 2016 02:28 IST|Sakshi
కర్కశం..

చిన్నారి ఒంటినిండా సిగరెట్ వాతలు
తల్లిదండ్రుల ముసుగులో ఘోరం
అడ్డుగా ఉందని హత్యకు యత్నం
పోలీసులను తప్పుదారి పట్టించిన వైనం
బొల్లారం ఘటనపై ‘సాక్షి’ విచారణ
వెలుగు చూసిన కొత్త కోణం

 సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి : చెప్పిన మాట వినటం లేదనే నెపంతో నాలుగేళ్ల చిన్నారిపై తల్లిదండ్రులు అతి కర్కశంగా దాడి చేసిన ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. జిన్నారం మండలం పోచమ్మ బస్తీలో చోటుచేసుకున్న ఈఘటనపై ‘సాక్షి’ సమాంతర పరిశోధనలో వెలుగుచూసిన అంశాలు ఇలా ఉన్నాయి.  ముద్దులొలికే చిట్టితల్లి ఒంటి నిండా సిగరెట్‌తో వాతలు పెట్టి, మొఖం చిట్లిపోయేటట్టు కొట్టిన దుర్మార్గపు తల్లిదండ్రుల్లో... పాప  తండ్రిగా చెప్తున్న చక్రవర్తి సొంత తండ్రి కాదని తేలింది. గుంటూరు పట్ణణానికి చెందిన రాధిక అలియాస్ రజియా సుల్తాన్ (పాప తల్లి)  ఆరు నెలల కిందటే భర్తను వదిలేసి చక్రవర్తితో రహస్యంగా వచ్చినట్టు  విశ్వసనీయంగా తెలిసింది.

ఈ మేరకు  తన భార్య  రజియా సుల్తానా, కూతురు తప్పిపోయిందని ఆమె భర్త హబీబ్ గుంటూరు ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదు చేశారు.  పసిబిడ్డను దారుణంగా  హింసించిన తీరు చూస్తే...  వీళ్లు  సొంత తల్లిదండ్రులేనా అని ఎవరికైనా అనుమానం వస్తుంది. ‘సాక్షి’కి అదే అనుమానం వచ్చింది. గుంటూరు జిల్లా నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి  ‘సాక్షి’కి చేరవేసిన క్లూతో తీగలాగితే అసలు విషయం బయటికి వచ్చింది. తమది ప్రకాశం జిల్లా పందులపల్లి గ్రామమని, ఐదేళ్ల క్రితం ప్రేమ

  వివాహం చేసుకున్నామని, పాప వయసు నాలుగేళ్లని, జీవనాధారం వెతుక్కుంటూ  నాలుగు నెలల క్రితమే జిన్నారం మండలం బొల్లారం వచ్చామని, పోచమ్మ బస్తీ నివాసం ఉంటున్నామని పాపను హింసించిన చక్రవర్తి, రాధికలు పోలీసు విచారణలో చెప్పారు. నిజానికి చక్రవర్తి, రాధికలు పోలీసులను తప్పు దారి పట్టించారు. గుంటూరు జిల్లా రామారెడ్డితోట రెండో వీధికి చెందిన రజియా సుల్తానాకు హబీబ్ అనే వ్యక్తితో 8 ఏళ్ల కిందటే వివాహం అయ్యింది. వీరికి ఆశ, రేష్మా ( ప్రియాంక) ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.  ఏడాది కిందట బతుకుదెరువు కోసం గుంటూరుకు వచ్చిన చక్రవర్తి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటూ రజియా సుల్తానాతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్ మాసంలో ఇంట్లో నుంచి రేష్మా అలియాస్ ప్రియాంకను తీసుకొని బయటికి వెళ్లిన రజియా సుల్తానా తిరిగి రాలేదని ఆమె భర్త హబీబ్ ‘సాక్షి’కి వివరించారు. ఆమె తప్పిపోయిందనే భ్రమలోనే ఉన్న హబీబ్ మార్చి మాసంలో తన భార్య, కూతురు తప్పిపోయిందని గుంటూరు ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదు చేశారు. మొదటి కూతరు ఆశ తండ్రి వద్దే ఉంటోంది.  కాగా  చక్రవర్తికి  తండ్రి ఆర్మీ జవానుగా రిటైర్డ్ అయ్యారు. చక్రవర్తి వివాహితుడా? కాదా అనే దానిపై స్థానికంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనకు భార్య ఒక పాప కూడా ఉందని చెప్తున్నారు.  నల్లగొండ జిల్లా అని కొందరు, ప్రకాశం జిల్లా అని ఇంకొం దరు చెప్తున్నారు. డిసెంబర్ మాసంలో పోచమ్మ బస్తీకి వచ్చిన రజీయా సుల్తానా తన పేరు రాధికగా, పాప పేరు ప్రియాంకగా మార్చుకున్నారు. స్థానికంగా ఉండే ఓ పరిశ్రమలో చక్రవర్తి పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు.

అయితే వారి మధ్య పాప ప్రియాంక  ఉండటం ఇబ్బందిగా మారింది. దీంతో పాపను వదిలించుకునే ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తోంది. పాపను దారుణంగా హింసించి అనారోగ్యం సాకుతో హత్య చేసేందుకు ప్రయత్నం చేసి ఉండవచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  వాస్తవం ఇలా ఉంటే... పోలీసులు ఇంకా రజియా సుల్తానా, చక్రవర్తి ఇచ్చిన తప్పుడు సమాచారం పట్టుకొనే వేలాడుతున్నారు. విచారణ కోసం  గురువారం ఒక ప్రత్యేక  పోలీసు బృందాన్ని ప్రకాశం జిల్లాకు పంపుతున్నామని బోల్లారం పోలీసులు పేర్కొనటం గమనార్హం.

మరిన్ని వార్తలు