మృత్యువుతో పోరాటం

14 Dec, 2016 22:25 IST|Sakshi
మృత్యువుతో పోరాటం
బోన్‌మేరో వ్యాధితో బాధపడుతున్న చిన్నారి
సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు
కంబాలచెరువు : ఆ చిన్నారికి వచ్చిన రోగానికి కొద్ది రోజుల్లో చికిత్స చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. వైద్యం చేయించేందుకు ఆ పాప తల్లిదండ్రుల చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో దాతల సాయం అర్థించారు. రాజానగరం మండలం నందరాడ గ్రామానికి చెందిన మరుకుర్తి దుర్గారావు వికలాంగుడు. ప్రైవేట్‌ స్కూల్‌లో పనిచేస్తున్న అతడికి భార్య లోవకుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒక పాప ఆనందిని సురక్షకు అనారోగ్యం సోకింది. స్థానిక వైద్యులకు చూపించారు. వారు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించడంతో లవ్‌ అండ్‌ కేర్‌ సొసైటీ అధ్యక్షుడు అవ్వారు జయరాజు, శాంతిల సాయంతో వైద్యులకు చూపించారు. తమిళనాడులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు ఆమెకు బోల్‌మేరో వ్యాధి సోకినట్టు నిర్థారించారు. దీనికి సుమారు రూ.40 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఏం చేయాలో తెలియని ఆ చిన్నారి తల్లిదంద్రులు తిరిగి ఇంటికి వచ్చేశారు. వీరి పరిస్థితి తెలిసిన రాజానగరంలోని కృషి ఇంగ్లిష్‌ మీడియం స్కూలు విద్యార్థులు కొంత ఆర్థిక సాయం అందజేశారు. ప్రస్తుతం ఆమె జీఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. రోజుకు రూ.8 వేలు ఖర్చవుతుందని, కొద్ది రోజుల్లో చికిత్స చేయకపోతే పాప దక్కదని వైద్యులు చెప్పారని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దాతలు ముందుకు వచ్చి తమ కుమార్తెను కాపాడాలని అభ్యర్థిస్తున్నారు. దాతలు ఎస్‌బీహెచ్‌ అకౌంట్‌ నంబర్‌‍ 62398326449కు ఆర్థిక సాయం అందించాలని, లేదా  9849684252 ద్వారా గానీ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వార్తలు