బిడ్డ బరువు తక్కువని బాధపడొద్దు!

18 Aug, 2016 11:46 IST|Sakshi
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలకు ఫోటోథెరపీ చికిత్స చేస్తున్న దృశ్యం
  •  చిత్తూరు ఆసుపత్రిలో ఓ శిశువుకు పునర్జన్మ
  •  నవజాత శిశువులకు వైద్యుల భరోసా
  • కార్పొరేట్‌ ఆసుపత్రుల తరహా వైద్యసేవలు

  • అప్పుడే పుట్టిన పిల్లల్లో కొందరు అనారోగ్యానికి గురవడం, బరువు తక్కువతో పుట్టడం, నెలలు నిండక పోవడం, ఉమ్మ నీళ్లు తాగేయడం జరుగుతుంది. ఒకప్పుడయితే ఈ సమస్యలకు తల్లితండ్రులు గాబరాపడిపోయి కార్పొరేట్‌ ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినా ప్రాణాలు నిలబడతాయనే నమ్మకం ఉండేదికాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వీటికి మెరుగైన వైద్యం అందుతోంది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ నవజాత శిశువుకు 85 రోజుల పాటు వైద్య సేవలు అందించి ఆరోగ్యంతో ఇంటికి పంపించడమే ఇందుకు నిదర్శనం.

    చిత్తూరు (అర్బన్‌): తక్కువ బరువుతో జన్మించిన శిశువుకు పునర్జన్మ ప్రసాదించారు చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు. యాదమరి మండలం పెరుమాలపెంటకు చెందిన రమేష్, రీట దంపతులకు పెళ్లయిన ఏడాదికి ఓ పాప పుట్టింది. ఈ నెలలు పూర్తవకుండానే రీట పురుడుపోసుకోవడంతో ఈ ఏడాది మే 25న 750 గ్రాముల బరువుతో బిడ్డ పుట్టింది. ప్రసవం జరిగింది వేలూరులోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండటంతో రూ.లక్ష ఖర్చు పెట్టారు. రోజువారీ కూలీ పనిచేసే రమేష్‌ స్థాయికి ఇంత పెద్ద మొత్తం ఎక్కువే అయినా భరించాడు. మూడు రోజుల తరువాత పాపకు అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు అందించాలంటే మరో రూ.2 లక్షలకు పైనే ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పటికే రూ.కోటి వ్యయంతో నవజాత శిశువుకు ప్రత్యేక చికిత్స అందించే పరికరాలు, ప్రత్యేకమైన ఐసీయూ వార్డులు (ఎస్‌ఎన్‌సీయూ యూనిట్‌) ఏర్పాటయ్యాయి. మే నెల 28న చిత్తూరు ఆసుపత్రిలోని బిడ్డను చేర్పించారు. అప్పటి నుంచి దాదాపు 85 రోజుల పాటు శిశువుకు వార్మర్‌ థెరపి నిర్వహించిన వైద్యులు చాలా జాగ్రత్తగా చూసుకుని అన్ని సేవలు అందించారు. ఇప్పుడు శిశువు బరువు 1.580 కిలో గ్రాములకు చేరుకుంది. నవజాత శిశువు ఆరోగ్యంగానూ తయారవడంతో బుధవారం రీటా దంపతుల పాపను డిశ్చార్జ్‌ చేశారు.

    వీటికీ వైద్యం
    ప్రస్తుతం చిత్తూరులోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో నవజాత శిశువుకు అన్ని రకాల వైద్య సేవలు లభిస్తున్నాయి. శ్వాసకోస వ్యాధితో బాధపడేవాళ్లకు సీ–పాప్, కామెర్లు వస్తే ఫోటోథెరపీ, బరువు తక్కువతో పుట్టే పిల్లలకు ఇంక్యూబేటెడ్, వార్మర్‌కేర్‌ చికిత్సలు అందిస్తున్నారు. ఇందు కోసం వార్డులో ప్రత్యేకమైన ఐసీయూ వార్డు, ఐదుగురు అనుభవజ్ఞులైన వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటున్నారు.

    మర్చిపోలేం
    మాకొచ్చే సంపాదనే అంతంత మాత్రం. మూడు రోజులు వేలూరు ఆస్పత్రిలో ఉన్నప్పుడు రూ.లక్ష అయ్యింది. చిత్తూరు ఆస్పత్రికి వచ్చేశాక ఇక్కడ డాక్టర్లు నా బిడ్డను కంటికి రెప్పలా కాపాడినారు. ఇప్పుడు పాల చాలా బాగా ఉంది. ఈ మేలు మరువలేనిది. డాక్టర్లకు, నర్సులకు ఎప్పటికి రుణం తీర్చుకోలేను.
    – రీటా

    ధైర్యంగా రండి
    ప్రభుత్వ ఆసుపత్రి అంటే వైద్యం సరిగా అందదనేవి సరైంది కాదు. ప్రత్యేకంగా నవజాత శిశువులో ఎదురయ్యే అన్ని రకాల సేవలకు ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. అనుభవం ఉన్న ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఉన్నాం. అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే పసిరికలు, ఫిట్స్‌ లాంటి వ్యాధుల్ని కూడా బాగుచేస్తున్నాం. ప్రజలు ధైర్యంగా ఆసుపత్రికి రావొచ్చు.
        – డాక్టర్‌ ఎస్‌ఎన్‌.మూర్తి, చిన్నపిల్లల వైద్య నిపుణులు, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి.

మరిన్ని వార్తలు