హుషారెత్తించే ‘గోలీ’మార్‌

5 May, 2017 00:00 IST|Sakshi
హుషారెత్తించే ‘గోలీ’మార్‌

హలో ఫ్రెండ్స్‌ మీ పట్టణ, నగర ప్రాంతాల్లో ఏమో గానీ మా ఊళ్లో మాత్రం ఈ ఎండాకాలం సెలవుల్లో ఎన్నో ఆటలు ఆడుకుంటున్నాం. మేము ఆడుకునే ఆటల్లో ముఖ్యమైనది గోలీల ఆట. ఈ ఆట ఆడుతున్న కొద్దీ హుషారుగా ఉంటుంది. ఎందుకంటే మనతో పాటు ఆడేవారి గోలీలను గెలుచుకోవడం నిజంగా థ్రిల్లే కదా! ఆట అయిపోయే లోపు జేబు నిండా గోలీలు వేసుకుని నడుస్తుంటే వచ్చే గళగళ శబ్ధం వింటే ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంటుంది. మీరూ ఈ ఆట ఆడాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీ స్నేహితులంతా కలిసి ఓ జట్టుగా ఏర్పడాలి.

ముందుగా ఓ బొద్దిని (చిన్నపాటి గుంత) ఏర్పాటు చేసుకుని కొద్ది దూరం నుంచి బొద్ది వైపుగా గోలీలు వేయాలి. బొద్దికి దగ్గరగా ఉన్న వారు ఫస్ట్‌ ఆడాలి అన్నమాట. గోళీని మన చూపుడు వేలుకు ఆనించి వెనక్కు లాగి వదిలితే అది రాకెట్‌లా ముందుకు పోతుంది. ఇలా బొద్దిలోకి గోలీ వేసుకుంటే బోనస్‌ ఆట వస్తుంది. మనతో పాటు ఆడుతున్న వారి గోలీలను టార్గెట్‌ చేసి కొట్టుకుంటూ పోవాలి. తక్కువ పాయింట్‌లు తెచ్చుకున్న వారు బొద్ది వైపుగా తన గోలీని దోకాల్సి ఉంటుంది. లేదంటే ఒప్పందం మేరకు గోలీ ఇచ్చేయాల్సి ఉంటుంది. భలే గమ్మత్తుగా ఉంది కదూ...ఇంకెందుకు ఆలస్యం రండి గోలీలు ఆడుకుందాం.
– గుమ్మఘట్ట

మరిన్ని వార్తలు