పాపం పసిపాపలు

6 Aug, 2016 07:33 IST|Sakshi
పాపం పసిపాపలు

రోడ్డుపాలైన ఇద్దరు ఆడ శిశువులు

ఒకరికి అనారోగ్యం, మరొకరిని కావాలని వదిలి వెళ్లిన వైనం...ఆడపిల్ల భారం అనుకుందో ఓ అమ్మ...అనారోగ్యంతో ఉన్న బిడ్డను దేవుడి మెట్లపై ఉంచి నిర్దయగా వదిలివెళ్లిందో మరో తల్లి..దీంతో వెచ్చని పొత్తిళ్లలో ఉండాల్సిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా సర్వజనాస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు.   

అనంతపురం సిటీ: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఓ పసికందును(ఆడశిశువు) ఎవరో గర్భిణుల వార్డు ఆవరణలో వదిలి వెళ్లారు. కుక్కలు స్వైర విహారం చేస్తున్న ఈ ప్రాంతంలో ఆ చిన్నారి పెట్టిన చావు కేకలే పాపను కాపాడాయి. క్షణం ఆలస్యం జరిగి ఉన్నా... స్థానికులు సకాలంలో స్పందించక పోయినా..పాప శునకాలకు ఆహారంగా మారిపోయేది.  ఈ ఘటనపై  ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎంఓ,  శివకుమార్‌ మాట్లాడుతూ.. గర్భిణుల వార్డు ఆవరణలోని నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి పెట్టారనీ, చీకట్లో పాప ఏడుపులు విని స్థానికులు సమాచారం ఇవ్వడంతో విషయం తమకు తెలిసిందన్నారు.

పాపను పోలీసుల సమక్షంలో స్వాధీనం చేసుకుని పరీక్షించగా, కామెర్లు ఉన్నట్లు గుర్తించి వైద్యం అందిస్తున్నామన్నారు. శిశువు చేతికి ఉన్న ట్యాగ్‌ను బట్టి చూస్తే ప్రైవేట్‌ ఆస్పత్రి నుంచి తీసుకువచ్చి ఇక్కడ వదిలేసినట్లు తెలుస్తోందన్నారు. ఇక ధర్మవరానికిSచెందిన శిశువు అనారోగ్యంతో ఉండడంతో తల్లిదండ్రులే ధర్మవరం రూరల్‌ పరిధిలోని నగటూరు గ్రామంలోని పోతప్పస్వామి ఆలయం మెట్లపై వదిలి పెట్టినట్లు తెలుస్తోందన్నారు.

నిఘాలో తేలుతుంది..
సర్వజనాస్పత్రి ఆవరణ మెత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పసి కందును ఎవరు వదిలి పెట్టారో ఉదయాన్నే గుర్తించే వీలుందని వైద్యాధికారి తెలిపారు. పోలీసులు కూడా ఆ పనుల్లో ఉన్నారన్నారు. 

మరిన్ని వార్తలు