బాలల హక్కులు పరిరక్షించాలి

12 Dec, 2016 14:45 IST|Sakshi
బాలల హక్కులు పరిరక్షించాలి

ఒంగోలు టౌన్ : బాలల హక్కులు పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు సభకు ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. బాలలకు అన్నిరకాల వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పురుషులతో సమానంగా ఆడ పిల్లలను చదివించాలని కోరారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ జి. విశాలాక్షి అధ్యక్షతన నిర్వహించిన సభలో మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి, డీఎంహెచ్‌ఓ యాస్మిన్, అడిషనల్ డీఈఓ విజయలక్ష్మి, జీసీడీఓ సరస్వతి, ఐసీపీఎస్ డీసీపీఓ జ్యోతిసుప్రియ, ఏసీఎల్ రమాదేవి, ఐఈఆర్‌ఎఫ్ సంస్థ ప్రతినిధి జోసఫ్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగరాజు రాంబాబు పాల్గొన్నారు.
 
ఆకట్టుకున్న ప్రదర్శనలు
బాలల హక్కుల వారోత్సవాల ముగింపు సందర్భంగా బాలికల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దర్శి కేజీబీవీకి చెందిన బాలికలు ప్రదర్శించిన ‘బచావో బేటీ పడావో’ నాటిక సభికులను ఆలోచింప జేసింది. ఆడపిల్లల పట్ల లింగ వివక్ష చూపరాదని, వారిని రక్షించాలంటూ బాలికల ప్రదర్శన ఆకట్టుకుంది. ఒంగోలులోని శారా హోమ్‌కు చెందిన మానసిక విద్యార్థులు దేశభక్తి గీతానికి చక్కగా అభినయం చేసి ప్రశంసలు అందుకున్నారు. ఒంగోలులోని బాలసదన్, ఐఈఆర్‌ఎఫ్‌కు చెందిన బాలలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వల్లూరు సెక్టార్‌కు చెంందిన అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలతో అలరించారు.

సుప్రియ కళానిలయం డెరైక్టర్ రంగుల సంధ్య సమాజ ఆచారాలు, కట్టుబాట్ల పేర్లతో మహిళలకు వేస్తున్న సంకెళ్లను చేధించుకొని ఏవిధంగా ముందడుగు వేస్తారన్న దానిని స్పాట్ పెయింటింగ్ రూపంలో చక్కగా చిత్రాన్ని చూపించారు. రంగుల సంధ్య స్పాట్ పెయింటింగ్‌కు ముగ్ధుడైన ఎస్‌ఎస్‌ఏ పీఓ సుధాకర్ అక్కడికక్కడే రెండు వేల రూపాయలు చెల్లించి ఆ పెయింటింగ్‌ను సొంతం చేసుకున్నారు. బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జిల్లాకు చెందిన అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులను అభినంధించారు.

మరిన్ని వార్తలు