భాస్కర్ నువ్వు సూపర్

16 Apr, 2016 10:22 IST|Sakshi
తల్లిదండ్రులతో భాస్కర్, అతడి ఇల్లు

అంతర్జాతీయస్థాయిలో ప్రభవించిన సిక్కోలు యువకుడి ప్రతిభ
అరుదైన పరిశోధనల్లో రాణించిన భాస్కరరావు
స్విట్జర్లాండ్ ఎక్స్‌లెన్స్ ఉపకార వేతనానికి ఎంపిక
ఆనందంతో మురిసిపోతున్న తల్లిదండ్రులు

 
నేపథ్యం చిన్న పేద కుటుంబం... చదివింది తన పల్లెలోనే చిన్న కాన్వెంట్‌లో... కానీ నేడు ఆ యువకుడి ప్రతిభ గురించి జిల్లా అంతా వేనోళ్ల పొగుడుతోంది. కూలి చేసి కొడుకును చదివించినందుకు ఆ తల్లిదండ్రుల మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది. కష్టాల అడ్డుగోడలను దాటి ఆ యువకుడు సాధించిన విజయం ఇప్పుడు విద్యార్థులందరికీ ఆదర్శప్రాయమవుతోంది. రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా పసిగట్టే విధానాన్ని రూపొందించడం ద్వారా స్విట్జర్లాండ్ ఎక్స్‌లెన్స్ ఉపకారవేతనానికి ఎంపికైన చింతాడ భాస్కరరావు జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు.
 
ఉర్జాం(పోలాకి): శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని ఉర్జాం ఓ చిన్న గ్రామం. ఇప్పుడు ఆ గ్రామం పేరు జిల్లా అంతా మార్మోగిపోతోంది. గ్రామానికి చెందిన చింతాడ నూకయ్య, నారాయణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చింతాడ భాస్కరరావుతోనే ఇది సాధ్యమైంది. పేద కుటుంబంలో పుట్టినా చదువులో ఏనాడూ వెనుకంజ వేయని భాస్కరరావు ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాడు.
 
స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన భాస్కరరావు, ఆ తర్వాత 2008లో ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యాడు. నూజివీడు ట్రిపుల్ ఐటీ తొలి బ్యాచ్‌లో చదువు ముగిసిన తర్వాత భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో)కి చెందిన ఇండియన్ సైన్స్ అకడమిక్ సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ సాధించాడు. 2004లో గేట్ పరీక్ష రాసి 5వ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత పరిశోధన కోసం మద్రాస్ ఐఐటీ ఎంచుకుని బయో మెడికల్ ఇంజినీరింగ్‌లోకి అడుగుపెట్టాడు. అడుగు పెట్టింది మొదలు పరిశోధనలు చేయడంలో రాణిస్తున్నాడు.
 
అందులో భాగంగా ఆల్ట్రాసౌండ్ ఎలాస్టోగ్రఫీకి సంబంధించి ఒక థీసిస్‌ను రూపొందించాడు. రొమ్ము క్యాన్సర్‌ను పసిగట్టేందుకు భాస్కరరావు రూపకల్పన చేసిన ఈ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి పరిశోధక విద్యార్థులకు గుర్తింపుగా ఇచ్చే అకడమిక్ ఎక్స్‌లెన్స్ స్కాలర్‌షిప్‌కు భాస్కరరావు ఎంపికయ్యాడు. దీంతో భాస్కరరావు ప్రతిభ జిల్లా అంతా మార్మోగుతోంది. కొడుకు సాధించిన విజయం చూసి తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. నేటికీ ఉపాధి హామీ వేతనదారులుగా పనిచేస్తున్న నూకయ్య, నారాయణమ్మ దంపతులు కొడుకు విజయాన్ని అందరితో పంచుకుని ఆనందపడుతున్నారు.  
 
అభినందనల వెల్లువ...
స్విస్ ప్రభుత్వం నుంచి ఉపకార వేతనానికి ఎంపికైన చింతాడ భాస్కరరావుకు పలువురు అభినందనలు తెలిపారు. వారి తల్లిదండ్రుల వద్ద నుంచి ఫోన్ నంబర్ తీసుకుని మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, డీసీసీబీ చెర్మైన్ డోల జగన్, మండలప్రత్యేక సలహాదారు తమ్మినేని భూషణరావు, వైఎస్‌ఆర్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణారావు, ఇతర నాయకులు, తోటి స్నేహితులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
 
జ్యూరిచ్‌లో పీహెచ్‌డీ చేస్తా...
విదేశీ ఉపకార వేతనానికి ఎంపికైన చింతాడ భాస్కరరావుకు ‘సాక్షి’ ఫోన్‌లో పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే విలువైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన స్విట్జర్లాండ్‌లోని జ్యూరీచ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తానని చెప్పారు. దాంతోపాటు ఆరోగ్య సంరక్షణలో అత్యంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని కనిపెట్టాలనే లక్ష్యంతో ఉన్నానని తెలిపారు. తన తల్లిదండ్రుల కష్టం వల్లే ఇంతటి వాడిని అయ్యాయని, వారి రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనని తెలిపారు.
 
 చాలా సంతోషంగా ఉంది...
 నా కొడుకు ఇంతలా రాణించడం ఆనందంగా ఉంది. బూర్జ మండలం గుత్తావల్లి నుంచి నా చిన్నతనంలో నా తల్లితో కలసి ఇక్కడకి వలస కూలీగా వచ్చి స్థిరపడ్డాను. ఇప్పటికీ కూలి పనులే చేస్తున్నా ను. నాకు, నా భార్యకు చదువురాదు. నా కొడుకునైనా చదివించాలనే ఆశతోనే కష్టపడ్డాం. నా కొడుకు పట్టుదలతో నా కోరిక నెరవే రింది. ఫలితాలు వచ్చిన వెంటనే మాకు ఫోన్  చేసి చెప్పాడు.
 -  చింతాడ నూకయ్య, విద్యార్థి తండ్రి
 
 మా గ్రామానికే గర్వకారణం
 అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విద్యార్థి మా గ్రామానికి చెందిన వాడు కావడం మాకు ఎంతో గర్వకారణం. ఇప్పటికే చాలామంది వివిధ స్థాయిలో మంచి హోదాల్లో స్థిరపడ్డారు. భాస్కరరావు గ్రామానికి రాగానే మా గ్రామస్తుల తర ఫున అభినందన సభ నిర్వహిస్తాం.
 - కణితి సత్తిబాబు, సర్పంచ్, ఉర్జాం.

మరిన్ని వార్తలు