చినుకు చిందేసింది

20 Jul, 2016 00:52 IST|Sakshi
చినుకు చిందేసింది
జిల్లాలో పలుచోట్ల వర్షం
సాయంత్రం వరకు చిరుజల్లులు 
ఇళ్లకు వెళ్లేందుకూ ఇబ్బందిపడ్డ విద్యార్థులు
వేడివేడి తినుబండారాలకు పెరిగిన గిరాకీ 
సాక్షి, రాజమహేంద్రవరం : 
పక్షం రోజులుగా స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు మళ్లీ ప్రభావం చూపిస్తున్నాయి. సోమవారం రాత్రి జిల్లాలో పలుచోట్ల వర్షం పడగా మంగళవారం మధ్యాహ్నం చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చిరుజల్లులు పడ్డాయి. ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం చల్లబడింది. రాజమహేంద్రవరం, కాకినాడ, రంగంపేటలలో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండపేట, రాజానగరం, పెదపూడి, రాజోలు, రామచంద్రాపురంలలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. కొత్తపేట, పెద్దాపురం, పిఠాపురం, పి.గన్నవరంలలో చిరుజల్లులు పడ్డాయి. రాజమహేంద్రవరంలో మధ్యాహ్నం ఓ గంటపాటు భారీ వర్షం పడింది. సాయంత్రం ఐదు గంటల వరకు ఆగకుండా చిరు జల్లులు పడ్డాయి. దీంతో జనజీవనం స్తంభించింది. దుకాణాలు వ్యాపారాలు లేక వెలవెలబోయాయి. పాఠశాలలు, కళాశాలలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది వర్షంలో తడుస్తూనే తమ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. వాతావరణం చల్లబడడంతో మొక్కజొన్న పొత్తులు, వేడివేడి పకోడీలకు గిరాకీ పెరిగింది. రోడ్లవెంబడి ఉన్న పలహార బళ్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. చిరుజల్లులు పడతుండగానే రాజమహేంద్రవరం నగరంలో పారిశుధ్య కార్మికులు మురుగునీరు వెళ్లేందుకు కాలువల్లో చెత్తను తొలగించారు. వర్షానికి రోడ్లపైకి వచ్చిన చెత్తను తొలగించారు. రైల్వే స్టేషన్‌ ఎదురు రోడ్డులో వర్షం నీరు నిలబడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

 

మరిన్ని వార్తలు