సర్జరీ చేయించే స్తోమత లేక...

24 Jun, 2016 10:36 IST|Sakshi
చిన్నారి జ్ఞానసాయితో తల్లిదండ్రులు

మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి
తంబళ్లపల్లె కోర్టును ఆశ్రయించిన దంపతులు
హైకోర్టును ఆశ్రయించాలన్న జడ్జి

 
తంబళ్లపల్లె: ఎనిమిది నెలల ఆ చిన్నారికి  పుట్టుకతోనే కాలేయ సంబంధిత వ్యాధి వెంటవచ్చింది. కానీ పుట్టింది నిరుపేద కుటుంబంలో కావడంతో సర్జరీ చేయించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోయింది. అయినప్పటికీ నానా కష్టాలుపడి ఒకసారి సర్జరీ చేయిస్తే అది విఫలమైంది. లివర్ పూర్తిగా మార్పుచేస్తే ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందుకు రూ.16 లక్షలదాకా ఖర్చవుతాయంటున్నారు. అయితే అంతసొమ్ము వెచ్చిస్తే స్తోమత లేని ఆ తల్లిదండ్రులు గుండె రాయి చేసుకున్నారు. తమ బిడ్డకిక మరణమే శరణ్యమనుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించారు. హృదయాన్ని పిండేసే ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలివీ..

చిత్తూరుజిల్లా ములకలచెరువు మండలం బత్తలాపురానికి చెందిన రమణప్ప, సరస్వతిలది నిరుపేద కుటుంబం. రమణప్ప బెంగళూరులోని సూపర్‌మార్కెట్‌లో సేల్స్‌మన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి గత అక్టోబర్ 10నజ్ఞానసాయి అనే చిన్నారి జన్మించింది. పుట్టుకతోనే ఆ చిన్నారికి బిలియరీ అట్రాసియా(కాలేయం జబ్బు) ఉన్నట్లు నిర్ధారించిన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు రెండు వారాల్లోపు లివర్ ప్రైమరీ సర్జరీ చేయాలన్నారు. రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఖర్చవుతుందన్నారు. నెల తరువాత బెంగళూరు ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి డాక్టర్లు గతేడాది డిసెంబర్ 31న సర్జరీ చేశారు. 4 నెలల తరువాత ఫలితం చెబుతామన్నారు. ఆ ప్రకారం బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షలు చేసిన వైద్యులు సర్జరీ విఫలమైందన్నారు.

దీంతో బెంగళూరులోనే నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్చగా.. లివర్ పూర్తిగా మార్పుచేస్తే ఫలితముంటుందని వైద్యులు చెప్పారు. ఇందుకు 16 లక్షలదాకా ఖర్చవుతుందన్నారు. కాలేయం మార్పిడి తర్వాత కోలుకునేవరకు నెలకు రూ.50 వేల విలువైన మందులు వాడాలన్నారు. నాలుగు నెలల్లోపు సర్జరీ చేయాలని, లేకుంటే ప్రమాదమేనని తేల్చిచెప్పారు. అంత ఆర్థికస్తోమత లేని తల్లిదండ్రులు తమ బిడ్డకికే చావే శరణ్యమని భావించారు.  తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించాలంటూ గురువారం  తంబళ్లపల్లె కోర్టును, తర్వాత మదనపల్లె కోర్టును ఆశ్రయించారు. తంబళ్లపల్లె జడ్జి వాసుదేవ్ స్పందిస్తూ.. ఇలాంటి విషయాల్లో ఉన్నత న్యాయస్థానాలు మాత్రమే నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని, అందువల్ల హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు. మదనపల్లె జడ్జి సైతం ఇదే విషయం చెప్పారు.

సీఎం దృష్టికి తీసుకెళ్లినా..
తమ బిడ్డ జబ్బు విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, తిరుపతిలో జరిగిన మహానాడులో వినతిపత్రం సమర్పించానని.. అయినా ఫలితం లేకపోయిందని రమణప్ప ఆవేదన వ్యక్తంచేశారు. దాతలెవరైనా స్పందించి సాయమందించేందుకు 8142272114 నంబరులో సంప్రదించాలని వేడుకున్నారు.

మరిన్ని వార్తలు