లోకకల్యాణం కోసం..

18 Aug, 2016 01:00 IST|Sakshi
లోకకల్యాణం కోసం..
అలంపూర్‌ రూరల్‌: అష్టాదశశక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠమైన అలంపూర్‌ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో కృష్ణాపుష్కరాల్లో భాగంగా గురువారం పౌర్ణమి నుంచి రాష్ట్ర ప్రభుత్వం  శతచండీ యాగాన్ని నిర్వహించనుంది. ఈ మేరు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆలయంలోని కుంకుమార్చన మండపాన్ని ఇందుకు వేదికగా అధికారులు పరిశీలించారు. యాగం నిర్వహించేందుకు 40మంది రుత్వికులను పిలిపిస్తున్నట్లు దేవాదాయశాఖ అధికారి కృష్ణ తెలిపారు. అందుకు అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు అనువైన ప్రదేశాన్ని కలెక్టర్‌ టీకే శ్రీదేవి, ఐజీ శ్రీనివాస్‌రెడ్డి, డీఐజీ అకున్‌ సబర్వాల్, ఘాట్‌ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్‌రెడ్డి,జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రామకష్ణ, సహాయక కమిషనర్‌ కష్ణ, ఈఓ గురురాజ పరిశీలించారు. 
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చక స్వాములు తెలిపారు. ఎప్పటి నుంచో ఈ యాగం ఇక్కడ తలపెట్టాలని తలంచామని, ఈ యాగం విజయవంతమైన తరువాత మళ్లీ మహావిద్యాయాగం నిర్వహిస్తామని చెబుతున్నారు. ఐదురోజుల పాటు జరిగే ఈ యాగం ఆయుత చండీయాగం ఫలితం ఇస్తుందని పేర్కొన్నారు. 
 శ్రేయస్సు కోసమే.. 
రాష్ట్ర దేశ ప్రజల శ్రేయస్సు, సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ పుష్కర సమయంలో ఈ శత చండీయాగాన్ని నిర్వహిస్తున్నాం. పుష్కరాల్లో చేసే యజ్ఞయాగాదులకు విశేష ఫలితం ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఈ యాగం నిర్వహించాలని తలంచాం.
–శ్యాంకుమార్‌ శర్మ, యజుర్వేద పండితులు
మా కాంక్ష నెరవేరింది..
జోగుళాంబ ఆలయంలో ఈ శతచండీయాగం జరిపించాలని ఆలయ అర్చకులుగా సీఎం దృష్టికి తీసుకెళ్లాం. అందుకు వారు స్పందించి లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రజల యోగ క్షేమాల కోసం యాగాలకు ఎప్పటికీ సహకారం ఉంటుందని తెలిపారు. దీంతో మా ఆకాంక్ష నెరవేరింది.
–వెంకటకృష్ణ, శాస్త్ర పండితులు
 
అనేక శక్తులు సిద్ధిస్తాయి 
ఈ శతచండీయాగం ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ జనాకర్షణ, ధనాకర్షణ, రూపాకర్షణ శక్తులు సిద్ధిస్తాయి. ఇలాంటి యాగాలు అందరి శ్రేయస్సు కోసం తలపెట్టింది. ఈ యాగం ద్వారా ఈ ప్రాంతం మరింత అభివద్ధికి వస్తుంది. 
– వేముల విక్రాంత్‌శర్మ, పండితులు
ప్రముఖులు రానున్నారు..
పుష్కరాల్లో భాగంగా శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయంలో జరిగే శతచండీయాగానికి ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఆగమసంప్రదాయబద్ధంగా జరిగే ఈ యాగం ద్వారా విశేష పుణ్యఫలం లభిస్తుంది. 
– ఆనంద్‌శర్మ, జోగుళాంబ ఆలయ ముఖ్యఅర్చకులు
 
మరిన్ని వార్తలు