అరగంట వ్యవధిలో చోరీ సొమ్ము రికవరీ

31 Jan, 2017 23:17 IST|Sakshi
అరగంట వ్యవధిలో చోరీ సొమ్ము రికవరీ
కర్నూలు : కర్నూలు నగరం హిందుస్థాన్‌ హోటల్‌ పక్కన గల గురుదత్త బట్టల షాపుకు ఓ మహిళ దుస్తుల కొనుగోలుకు వెళ్లింది. చోరీకి అలవాటు పడ్డ ఇద్దరు మహిళలు ఆమెను అనుసరించి పర్సుతో పాటు సెల్‌ఫోన్‌ను దొంగలించి ఆటోలో ఎక్కి వెళ్లిపోయారు. బాధితురాలు అరగంట తర్వాత గుర్తించి ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ కృష్ణయ్య, ఏఎస్‌ఐ నిర్మలాదేవి, కానిస్టేబుల్‌ మద్దిలేటి బృందంగా ఏర్పడి సీసీ కెమెరాల ఫుటేజీ సహకారంతో మౌర్యా ఇన్‌ దగ్గర దొంగలను అదుపులోకి తీసుకున్నారు.
 
ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ మంగళవారం మధ్యాహ్నం ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అదే సందర్భంలో బాధితులు స్టేషన్‌లో ఉండగా వారిని విచారించారు. అరగంట వ్యవధిలో తమ సొమ్ములను పోలీసులు రికవరీ చేశారని బాధితులు ఎస్పీకి తెలిపారు. కేసును ఛేదించిన కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. బాధిత మహిళ ఎస్పీతో పాటు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు భద్రతాభావాన్ని పెంపొందించే విధంగా పోలీసులు పనిచేయాలని సూచించారు. అనంతరం స్టేషన్‌ అంతా కలియదిరిగి రికార్డులను పరిశీలించారు. సీఐ బి.ఆర్‌.కృష్ణయ్య, ఏఎస్‌ఐలు నిర్మలాదేవి, ఎస్‌.జె.సాహెబ్‌తో పాటు కానిస్టేబుల్‌ మద్దిలేటి తదితరులు ఎస్పీ వచ్చినప్పుడు స్టేషన్‌లో ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు