భక్తుల కొంగు బంగారం చౌడేశ్వరీదేవి

9 Apr, 2017 22:56 IST|Sakshi
భక్తుల కొంగు బంగారం చౌడేశ్వరీదేవి

సందర్భం : రేపటి నుంచి అమ్మవారి ఉత్సవాలు
భక్తుల కొంగుబంగారంగా అమడగూరులోని చౌడేశ్వరీదేవి విరాజిల్లుతోంది.  ప్రతి ఏటా ఛైత్ర మాసంలో ఈ ఆలయంలో చౌడేశ్వరీ అమ్మవారి ఉత్సవాలను ఎనిమిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
- అమడగూరు (పుట్టపర్తి)

క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం అమరావతి పట్టణంగా పిలువబడే ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న శ్రీరంగరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఎమ్మెల్యే సోదరులు కిష్టప్ప, శ్రీనివాసులు తమ బంధువులతో కలిసి రూ. కోటి వెచ్చించి, మూడు గోపురాలతో జీర్ణోద్ధరణ గావించారు. ఆలయం పేరిట ఓ కల్యాణమంటపాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ఇటీవల మరో రూ. 10 లక్షలు వెచ్చించి ఆలయం చుట్టూ రేకుల షెడ్‌ వేశారు.

అమ్మవారి ఉత్సవాలు ఇలా..
ప్రతి ఏటా ఛైత్రమాసంలో ఉగాది సందర్భంగా అమ్మవారిని 16 గ్రామాల్లో ఊరేగింపునకు తీసుకెళ్తారు. తర్వాత వచ్చే పున్నమితో సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే అమ్మవారి ఉత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 11న ప్రారంభం కానున్నాయి. 11న కొత్తపల్లి దొనకొండ వెంకటరమణ కుటుంబీకులు కుంభకూడు, 12న శీతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలచే ఉయ్యాలసేవ, 13న చీకిరేవులపల్లి, రెడ్డివారిపల్లికి చెందిన పెద్దక్క, రాజు కుటుంబీకులచే సూర్యప్రభ, 14న అమడగూరుకు చెందిన బ్రాహ్మణ, శెట్టిబలిజ సంఘం వారిచే చంద్రప్రభ, 15న కొత్తపల్లికి చెందిన పొట్టా కుటుంబీకులచే శ్రీజ్యోతి, 16న రెడ్డివారిపల్లికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి కుటుంబీకులచే అశ్వ వాహన, 17 న కొత్తపల్లికి చెందిన పొట్టా శివశంకర్‌రెడ్డి కుటుంబీకులచే సింహ వాహన, 18న గాజులపల్లికి చెందిన సుబ్బరాయప్ప కుటుంబీకులచే హంస వాహన సేవలు ఉంటాయి. కాగా ఈ ఉత్సవాల్లో 15న జరిగే శ్రీజ్యోతి ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా