లోక రక్షణకే క్రీస్తు ఉదయించాడు

25 Dec, 2016 23:32 IST|Sakshi
లోక రక్షణకే క్రీస్తు ఉదయించాడు

 – బిషప్‌ బీడీ ప్రసాద్‌రావు
కడప కల్చరల్‌ :లోక రక్షణ కోసమే ప్రభువైన ఏసుక్రీస్తు ఉదయించాడని సీఎస్‌ఐ సెంట్రల్‌ చర్చి బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ బీడీ ప్రసాద్‌రావు అన్నారు. ఆదివారం  క్రిస్మస్‌ పర్వదినాన్ని జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని సీఎస్‌ఐ సెంట్రల్‌ చర్చిలో బిషప్‌ బీడీ ప్రసాద్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రధాన ప్రసంగం చేశారు. లోకాన్ని త్యాగాలతో నింపి శాంతిని నెలకొల్పేందుకు దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపాడని, రెండు వేల సంవత్సరాల క్రితం ఉదయించిన ఆ మహానీయుని పుట్టిన రోజును నేటికీ లోకమంతటా పర్వదినంగా జరుపుకుంటోందన్నారు. ఆ మహానీయుని త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ శరీరానికి చిహ్నంగా రొట్టె, రక్తానికి గుర్తుగా దాక్ష రసాన్ని గురువులు ఆశీర్వాద పూర్వకంగా అందజేశారు. క్రీస్తు రాకడ లోకానికి శుభ సూచకమని, ఆయన రాకను కీర్తిస్తూ మహిమను ఘన పరుస్తూ ప్రార్థన పూర్వకంగా ఆయనను ఆహ్వానిద్దామని బిషప్‌ అన్నారు. అనంతరం ఆయన ఫాస్టర్‌ ఐజాక్‌ వరప్రసాద్‌ ఇతర గురువులతో కలిసి క్రిస్మస్‌ కేకును కట్‌ చేశారు. ప్రభు భోజన సంస్కారం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ కాపరులు, ఫాస్ట్రేట్‌ కమిటీ సభ్యులు,  విశేష సంఖ్యలో విశ్వాసులు  పాల్గొన్నారు.
ఆరోగ్యమాత చర్చిలో..
        స్థానిక ఆరోగ్యమాత చర్చిలో కథోలిక మేత్రాసన పీఠాధిపతి గల్లెల ప్రసాద్‌ ప్రధాన వక్తగా మాట్లాడారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపాడన్నారు. మనిషికి దేవుడు సమస్తము ఇచ్చాడని, కానీ మానవుడు దేవుని మార్గంలో జీవించలేక పోతున్నాడని, అందుకే సాటి మనిషిని ప్రేమించలేక కుటుంబ సమస్యలతో బాధలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభువు మాట ప్రకారం జీవించే వారే ప్రేమ, దయ, క్షమ, శాంతి కలిగి ఉంటారన్నారు. సిస్టర్‌ మంజుల ఆధ్వర్యంలో ఆరోగ్యమాత  బృందం దైవారాధన గీతాలను ఆలపించారు. ప్రార్థనల్లో ఫాదర్లు సుమన్, లూర్దురాజు, ఆరోగ్యరాజ్, సంబటూరు సురేష్, వరప్రసాద్, ఆంతోని, డీకన్‌ బ్రదర్లు,   ఉపదేశి ప్రభాకర్, విశ్వాసులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

 
 


 

మరిన్ని వార్తలు