క్రైస్తవ ఆస్తుల కబ్జాను సహించం

7 Feb, 2017 23:42 IST|Sakshi
క్రైస్తవ ఆస్తుల కబ్జాను సహించం
- న్యాయం జరిగే వరకు క్రైస్తవులకు అండగా ఉంటాం
- స్పందించకుంటే ఉద్యమం ఉద్ధృతం
- ఎమ్మెల్యే ఐజయ్య హెచ్చరిక  
 
కర్నూలు(టౌన్‌): టీడీపీ పాలనలో క్రైస్తవ మత సంస్థల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఐజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కోల్స్‌ కళాశాల ఆస్తులను కబ్జా చేశారని, ఇలాంటి ఘటనలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. క్రైస్తవ సంస్థల స్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బాప్టిస్టు క్రిస్టియన్‌ జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో  స్థానిక కోల్స్‌ కళాశాల వద్ద చేపట్టిన  రిలే నిరహార దీక్షలు మంగళవారంనాటికి 6వ రోజుకు చేరాయి. దీక్షల్లో ఎమ్మెల్యే ఐజయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు.
 
టీడీపీ ప్రభుత్వం దళితులు, మైనార్టీల పట్ల వివక్ష చూపుతోందన్నారు. క్త్రెస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. క్రైస్తవ సంస్థల ఆస్తులను కబ్జా చేస్తున్న అధికార పార్టీ నేతలకు ప్రభుత్వంతోపాటు అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. క్రయవిక్రయాలకు అనుమతి లేకున్నా అధికార పార్టీ నేతల అండతో ఆస్తులను కరిగించేస్తున్నారన్నారు. అన్యాయం జరిగిందని క్త్రెస్తవులంతా గగ్గోలు పెడుతున్నా అధికారపార్టీ నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ఐజయ్య ప్రశ్నించారు. దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  అక్రమంగా రిజిస్ట్రేషన్లను రద్దు చేయకుంటే  క్రైస్తవులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన లేవదీస్తామని హెచ్చరించారు. 
 
పలువురి మద్దతు, పూర్వ విద్యార్థుల ర్యాలీ..
రిలే నిరహార దీక్షలు చేస్తున్న క్త్రెస్తవ సంఘాల నాయకులకు మద్దతుగా 1985 సంవత్సరానికి చెందిన కోల్స్‌ కాలేజీ విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర నాయకులు దండు శేషుయాదవ్, దళిత న్యాయవాదుల సంఘం నాయకులు జయరాజు, బీసీ సంఘం జేఏసీ నాయకులు రవికుమార్, శ్రీరాములు, కోల్స్‌ చర్చి సంఘం అధ్యక్షులు లింకన్, అనిల్‌నాథ్, పాస్టర్లు విజయకుమార్, సజీవన్‌ తదితరులు దీక్షల్లో పాల్గొని మద్దతు తెలిపారు. 
 
>
మరిన్ని వార్తలు