ఫీజులను నియంత్రించాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కరాములు

27 Jun, 2013 01:49 IST|Sakshi

సంగారెడ్డి డివిజన్ , న్యూస్‌లైన్: ప్రయివేటు విద్యా సంస్థల ఫీజులను నియంత్రించి, గుర్తింపులేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్క రాములు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన సీపీఎం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిక ఫీజులు, అక్రమ డొనేషన్‌న్లు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ర్యాంకులను ప్రకటించ వద్దని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ర్యాంకుల పేరుతో జిల్లాలో అసత్య ప్రచారం నిర్వహించి ప్రయివేటు విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయన్నారు. ప్రతి ఏటా 20 శాతం నుంచి 100 శాతం ఫీజులు పెంచుతున్నట్లు చెప్పారు.
 
 ఫీజులు పెంచాల్సి వస్తే ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదన్నారు. జీఓ నంబరు 1 ప్రకారం పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, తాగునీరు, ఆటస్థలం, ల్యాబ్, లైబ్రరీ, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు ఉండాలన్నారు.  దీనికితోడు ఫిట్‌నెస్‌లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నారని, ఫిట్‌నెస్‌లేని బస్సులను వెంటనే సీజ్ చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లికార్జున్, రాజయ్య, బి.మల్లేశం, ఎ.మల్లేశం, జయరాజు, జిల్లా కమిటీ సభ్యులు మాణిక్యం, అడివయ్య, సాయిలు, ప్రవీణ్, భాస్కర్, రేవంత్, బాలమణి, నర్సమ్మ, గణేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు