ఆ రాత ఆయనదేనా..!

24 Jun, 2016 09:52 IST|Sakshi
ఆ రాత ఆయనదేనా..!

పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఎదుర్కొన్న ఒత్తిళ్లు ఏమై ఉంటాయి?
ఐపీఎస్ మరణంపై లోతుగా అధ్యయనం చేస్తున్న సీఐడీ
 
విశాఖపట్నం : పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ మృతి కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ ఆయన స్వదస్తూరితో రాశారా? లేదా? అనే కోణంలో హ్యాండ్ రైటింగ్ నిపుణుడితో పరిశీలన జరుపుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఆధారాల ప్రకారం నివేదిక ఇప్పటికే హైదరాబాద్‌లో సిద్ధమైనట్లు సమాచారం. నేడో రేపో దర్యాప్తు అధికారులకు ఆ నివేదిక చేరనుంది.
 
 తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతనిని రాజకీయ, అధికార వర్గాలు హత్య చేశాయని శశికుమార్ తల్లిదండ్రులు ఆరోపించడంతో తమిళనాడు పోలీసులు జిల్లాకు వచ్చి దర్యాప్తు చేస్తారని భావించినప్పటికీ ఇంతవరకూ అలాంటి సమాచారం తమకేమీ రాలేదని సీఐడీ అధికారులు అంటున్నారు. అయితే సీఐడీ డీఎస్పీ మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రధానంగా సీఐడీ దృష్టి సారించింది. రెండు సార్లు విచారణకు వెళ్లిన సీఐడీ అధికారులు అనేక మందిని విచారించి అనేక విషయాలను తెలుసుకున్నారు.
 
శశికుమార్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మావోయిస్టు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరుల అరెస్టులు గానీ, లొంగుబాట్లు గానీ జరగలేదు. దీనిపై కూడా ఉన్నతాధికారుల నుంచి ఆయన ఒత్తిళ్లు ఎదుర్కొని ఉండవచ్చని తెలుస్తోంది. మావోయిస్టు సానుభూతిపరులనే నెపంతో గిరిజనులపై నమోదు చేసిన కేసులను శశికుమార్ మాఫీ చేశారని, ఆ విషయంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారని సమాచారం.
 
ఆ కారణంగానే ఇటీవల మన్యంలో మావోయిస్టులు లొంగిపోయినప్పుడు ఏఎస్పీ కేడర్‌లో ఉన్న శశికుమార్‌కు బదులు ఓఎస్‌డీ అట్టాడ బాబూజీ విశాఖ ఎస్పీతో పాటు విలేకరుల ముందుకు వచ్చారు. మావోయిస్టుల లొంగుబాట్లలో ఏఎస్పీ ప్రమేయం ఉండటం లేదని ఉన్నతాధికారులు పదే పదే అంటుండటంతో శశికుమార్ మానసికంగా కుంగిపోయి ఉంటారని తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు