బాబోయ్‌ సినిమా హాళ్లు...

30 Jul, 2016 18:53 IST|Sakshi
బాబోయ్‌ సినిమా హాళ్లు...
 నిబంధనలను గాలికి..
 సర్వత్రా విమర్శలు
 
నరసరావుపేట టౌన్‌: వినోదం కోసం ఉత్సాహపడితే ప్రమాదం వెన్నంటే ఉంటోంది...ఇదీ జిల్లాలో సినిమా థియేటర్ల పరిస్థితి. కష్టాన్ని, అలసటను మరిచిపోయేందుకు సినిమాకు వెళ్తే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదంటూ సగటు ప్రేక్షకుడు ఆందోళన చెందే పరిస్థితి జిల్లాలో ఉంది. జిల్లాలో నిర్వహిస్తున్న సినిమా థియేటర్లలో 80శాతం హాళ్లకు అగ్నిమాపకశాఖ అనుమతులు లేవని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఇక రెవిన్యూ డివిజన్‌ కేంద్రమైన నరసరావుపేట పరిస్థితైతే మరీ దారుణం. ఇక్కడ ఆరు థియేటర్లు ఉంటే ఐదింటికి అగ్నిమాపకశాఖ అనుమతులు లేవు. అగ్ని ప్రమాదాలు  సంభవించినప్పుడు నివారణ చర్యలకు తీసుకోవలసిన పరికరాలు అందుబాటులో లేవు.  నరసరావుపేట పట్టణంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని నిబంధనలను గాలికి వదిలేశారని, డివిజన్‌ స్థాయి అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. 
ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?
దాచేపల్లి మండలం నారాయణపురంలో అలంకార్‌ థియేటర్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో బుధవారం అగ్నికి ఆహుతి అయింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగక పోయినా రెండుకోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లింది. నరసరావుపేట పట్టణంలోని థియేటర్లలో కూడా ఇలాంటి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఎంతైనా ఉందనే భయాందోళనలు ప్రజానీకం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని సినిమా «థియేటర్లను  అగ్నిమాపక శాఖ అనుమతులు, నివారణ పరికరాలు లేకుండా  ఇలాగే కొనసాగిస్తే.. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.  థియేటర్లలో తనిఖీలు చేపట్టి, నిబంధనలను సరిగా పాటించకపోతే వాటిని నిలిపివేసే అధికారం అధికారులకు ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిసినా అధికారులు ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారో అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. ప్రతి విడుదల సినిమాకు థియేటర్ల యాజమాన్యం నుంచి వివిధ శాఖల వారు వాటాలను తీసుకోవడం వల్లే ఆవైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి.  ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు పాటించని సినిమాథియేటర్లపై  చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
 
అనుమతులు పొందాలని మూడుసార్లు నోటీసు ఇచ్చాం..
నరసరావుపేటలో కొనసాగుతున్న ఆరు సినిమా «థియేటర్లలో చిత్రాలయ «థియేటర్‌కు మినహా మిగిలిన సినిమా హాళ్ళకు తమశాఖ అనుమతులు లేవని ఫైర్‌ ఆఫీసర్‌ జయరావు స్పష్టం చేశారు. ఉన్న ఒక్క థియేటర్‌ కూడా రెన్యువల్‌ గడువు ముగియవచ్చిందన్నారు. ఇప్పటికే అనుమతులు పొందాలని మూడుసార్లు నోటీసులు జారీ చేశామన్నారు. ఉన్నతా«ధికారుల ఆదేశాలతో చట్టపరమైన చర్యలు తీసుకొంటామన్నారు.                      
జయరావు ఫైర్‌ఆఫీసర్‌
 
మరిన్ని వార్తలు