ఒత్తిడి తట్టుకోలేక బదిలీలు నిలిపివేసిన ఐజీ

30 Jun, 2016 09:06 IST|Sakshi
  • పట్టు బిగిస్తున్న అధికార పార్టీ
  • సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీల్లో పైరవీలు
  • కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సిఫార్సులకు చెక్ పెడుతున్న ఇన్‌చార్జులు
  •  
     
    పోలీస్ శాఖతో అధికార పార్టీ బంతాట ఆడుతోంది. బదిలీల్లో తలదూరుస్తూ పట్టు చూపుతోంది. ప్రతిభ, సమర్థతను పక్కకు నెట్టి ఆధిపత్యాన్ని నిరూపించుకుంటోంది. తాజాగా రేంజ్ పరిధిలో మంగళవారం జరిగిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల (సీఐలు) బదిలీలకు చెక్ పెట్టింది. కొత్త సీఐలను చేర్చుకోవద్దంటూ హుటాహుటిన హుకుం జారీ చేయించింది. బదిలీలు జరిగిన ప్రతిసారీ అధికార పార్టీ ఇదే దందాను అవలంబిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజారుస్తోంది.

     
    గుంటూరు : గుంటూరు పోలీస్ రేంజ్‌లో తాజా గా మంగళవారం ఏడుగురు సీఐలకు అటాచ్‌మెంట్‌లపై పోస్టింగ్‌లు కేటాయించారు. ప్రకాశం జిల్లాలో అధికార పార్టీలో ఉన్న గ్రూపు విభేదాల నేపథ్యంలో ఓ వర్గం  నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి తెల్లవారేసరికి బదిలీలను నిలిపివేయించారు.  తాము చెప్పేవరకు సీఐలను జాయిన్ చేసుకోవద్దంటూ ఆయా జిల్లాల ఎస్పీలకు ఐజీ కార్యాలయం నుంచి ఫోన్‌లు వెళ్లేలా చేశారు. దీంతో కొత్త పోస్టింగ్‌లు పొందిన సీఐల ఆనందం ఒక్క రాత్రికే ఆవిరైంది.
     
    ప్రకాశం జిల్లాలోని అద్దంకి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, చీరాల, ఒంగోలు రూరల్ సర్కిళ్లలో పనిచేస్తున్న సీఐలకు మంగళవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా  స్థానాల్లో కొత్త సీఐలకు అటాచ్‌మెంట్‌లపై పోస్టింగ్‌లు ఇచ్చారు. గుంటూరు అర్బన్ జిల్లాలో కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్న పట్టాభిపురం స్టేషన్‌కు సైతం అటాచ్‌మెంట్‌పై సీఐని నియమించారు.

    ఈ బదిలీలన్నీ అధికారపార్టీ నేతల సిఫారసు మేరకే చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు చెప్పినా పోస్టింగ్‌లు వేశారంటూ అక్కడి నియోజకవర్గ ఇన్‌చార్జులు రాత్రికి రాత్రి ఉన్నతస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దీంతో తెల్లవారే సరికి బదిలీలను నిలిపివేస్తూ రేంజ్ ఐజీ ఎన్. సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు అటాచ్‌మెంట్‌పై పోస్టింగ్‌లు పొందిన సీఐలను చేర్చుకోవద్దంటూ ఆయా జిల్లాల ఎస్పీలకు ఫోన్‌లు వెళ్ళాయి. దీంతో సీఐల బదిలీల్లో మరోమారు గందరగోళం నెలకొంది.
     
    అధికారపార్టీ నేతల ఆశీస్సులు ఉంటేనే పోస్టింగ్‌లు
    రేంజ్ పరిధిలో అధికారపార్టీ నేతల ఆశీస్సులు పొందిన వారికే  పోస్టింగ్‌లు దక్కుతున్నాయనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. ఒకప్పుడు సీఐల బదిలీలు అంటే ఆ సర్కిల్ ప్రాధాన్యం, అధికారి పనితీరు ఆధారంగా జరిగేవి. ఈ తరహా బదిలీలకు టీడీపీ నేతలు అడ్డుకట్ట వేసేశారు. గతంలో  పోలీస్ ఉన్నతాధికారులు ఇలాగే పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని చేసిన ప్రయత్నాలను టీడీపీ నేతలే అడ్డుకున్నారు.

    ఓ దశలో సీఐల బదిలీలు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయంటే ఇక్కడి అధికారపార్టీ నేతల దందా అర్థం చేసుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు అధికారపార్టీ నేతలు చెప్పిన వారికే పోస్టింగ్‌లు వేయడం గుట్టుగా నడిచేది. ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, సొంత పార్టీలో గ్రూపులు ఉన్న చోట్ల ఇరువురూ సీఐల పోస్టింగ్‌ల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు పోటీపడుతున్నారు. ఇది పోలీస్ ఉన్నతాధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మరో వైపు  సమర్థత కలిగిన పోలీస్ అధికారులకు తగ్గ పోస్టింగ్ దక్కడం లేదు.

మరిన్ని వార్తలు