మావాడే ఉండాలి!

21 Sep, 2016 08:35 IST|Sakshi

సీఐల బదిలీలపై టీడీపీ నేతల పెత్తనం
పోస్టింగుల పేరిట భారీ వసూళ్లు
విజయవాడ నగరంలో ఇదీ పరిస్థితి

 
‘పోలీస్‌స్టేషన్లో నా మాటే చెల్లుబాటు కావడం లేదు. నా వ్యతిరేకులపై ఏవో కేసులు పెట్టమంటే రూల్స్ మాట్లాడుతున్నారు. ఇందుకేనా నేను అధికార పార్టీలోకి వచ్చింది. వెంటనే అక్కడ సీఐని మార్చండి. నా మనిషిని వేయండి’        
 - నగరంలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి హుకుం.
 
అమరావతి : విజయవాడలో ప్రస్తుత పరిస్థితికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. అక్రమార్జనకు నగరాన్ని ప్రధాన వనరుగా మలచుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు శాఖపై నియంత్రణ కోసం పట్టుబడుతున్నారు. తమ అభీష్టం మేరకే సీఐల బదిలీలు జరపాలని తేల్చి చెబుతున్నారు. తమపట్ల రాజకీయ విధేయతతోపాటు సీటుకు తగిన రేటు నిర్ణయించి  సొమ్ము చేసుకుంటున్నారు. పోస్టింగులను అంగడి సరుకుగా మార్చేస్తున్న అధికార పార్టీ నేతల యవ్వారం ఇదిగో ఇలా ఉంది...

ప్రక్షాళనా!... రాజకీయ పెత్తనమా!
రాజధానిగా రూపాంతరం చెందిన నగరంలో పోలీస్ వ్యవస్థ పటిష్టతకు ఉన్నతాధికారులు కొన్ని నెలల క్రితం కార్యాచరణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది సీఐలను వీఆర్‌కు పంపించడం రాజకీయంగా సంచలనం కలిగించింది. పుష్కరాలు ముగియడంతో ఆ అంశంపై మళ్లీ  దృష్టి సారించారు. ఆరు నుంచి ఎనిమిది మంది పనితీరు బాగోలేదని గుర్తించారు. శాంతిభద్రతల కోణంలో కీలకమైన నగరంలోని రెండు నియోజకవర్గాల్లో సీఐల పనితీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నారు.
 
ఉత్సవాల పేరిట వసూళ్ల దందాకు ఓ అధికారి ఓ ప్రజాప్రతినిధికి వత్తాసు పలికారు. పారిశ్రామిక ప్రాంతంలో ఓ అధికారి ప్రజాప్రతినిధికి ఏజెంట్‌గా మారిపోయారు. ఇక శివారులోని రెండు నియోజకవర్గాల్లో కూడా కొందరు అధికారులు సివిల్ వివాదాల్లో అత్యుత్సాహం చూపిస్తున్నారు. ట్రాక్ రికార్డే ప్రాతిపదికగా చురుకైన అధికారులను నియమించాలని భావిస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు.
 
అదేం కుదరదు... మా వాళ్లను నియమించాల్సిందే ...
 ‘అంతా ఉన్నతాధికారుల ఇష్ట ప్రకారం చేస్తామంటే కుదరనే కుదరదు. ట్రాక్ రికార్డు, పనితీరు అంటూ ఏవేవో చెప్పొద్దు’అని  టీడీపీ నేతలు తేల్చిచెప్పారు. ఏకంగా సీఎం కార్యాలయం వద్ద పంచాయితీ పెట్టినట్లు సమాచారం. తాము సూచిస్తున్న అధికారుల పేర్లతో ఓ జాబితాను కూడా సీఎం కార్యాలయ అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
 సీఐల పోస్టింగులకు ఏకంగా సీఎం కార్యాలయ స్థాయిలో పైరవీలు చేస్తుండడం పట్ల పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో సీఐ పోస్టింగుకు ప్రజాప్రతినిధులు రూ.కోటి చొప్పున వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అదే రూరల్ పరిధిలో అయితే దాదాపు రూ.60 లక్షలు డిమాండ్ చేస్తున్నారని పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం టీడీపీ నేతలు పట్టుబడుతున్న కొన్ని పోస్టింగులు ఇవీ...
 
భూ దందాలకు పేరుబడ్డ శివారు నియోజకవర్గంలోని పోస్టింగులపై అక్కడ ప్రజాప్రతినిధి పట్టుదలకు పోతున్నారు. తన మాటకంటే గతంలో ప్రజాప్రతినిధిగా చేసిన టీడీపీ నేత మాటే చెల్లుబాటు అవుతోందని  మండిపడుతున్నారు. తాను చెప్పిన అధికారికి పోస్టింగు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
 
నగరంలోని ఓ కీలక నేత మళ్లీ టీడీపీలో చేరారో లేదో పంచాయితీలు మొదలయ్యాయి. 30 ఏళ్ల క్రితం తమ రాజకీయ ఎదుగుదలకు కేంద్రస్థానమైన చోటే మళ్లీ పాగా వేయాలని భావిస్తున్నారు. అందుకు తాము సూచించిన అధికారిని నియమించాలని పట్టుబడుతున్నారు.
 
నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో వైట్‌కాలర్ దందాలపై ఓ ప్రజాప్రతినిధి కన్నేశారు. అందుకోసం అక్కడ తన మనిషే ఉండాలని కరాఖండీగా చెబుతున్నారు.
 
రెండోసారి ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక నేత వ్యాపార వర్గాలను తన ఆదాయ వనరుగా మార్చుకునేందుకు పోలీసులను వాడుకోవాలని భావిస్తున్నారు.

ఈ పరిణామాలతో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయభేదాల అంశం ప్రస్తుతం సీఎం కార్యాలయానికి చేరింది.

>
మరిన్ని వార్తలు