ప్రశాంతంగా సివిల్స్‌

7 Aug, 2016 23:32 IST|Sakshi
ప్రశాంతంగా సివిల్స్‌
  • ఉదయం పరీక్షకు 39.27 శాతం.. మధ్యాహ్నం 38.83 శాతం హాజరు
  • నగరంలో 23 కేంద్రాల్లో నిర్వహణ
  • ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు 
  • హన్మకొండ అర్బన్‌ :  జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 10, 858 అభ్యర్థులకు కనీసం సగం మంది కూడా హాజరు కాలేదు. ఉదయం 4,264(39.27 శాతం) మంది, మధ్యాహ్నం 4,216(38.83 శాతం) మంది మాత్రమే హాజరయ్యారు. మొత్తం 23 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కొత్త రాష్ట్రంలో జిల్లాకు మొదటగా వచ్చిన అవకాశం కావడంతో ఎలాంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా కృషి చేశారు. నగరంలోని ఐదు ప్రధాన కేంద్రాల్లో సమాచార కేంద్రాలు, కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీనెంబర్‌ ఏర్పాటు చేశారు.  కలెక్టర్‌ వాకాటి కరుణ, పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్రం, కేంద్రం నుంచి వచ్చిన యూపీఎస్సీ పరిశీలకులు సైతం  ఏర్పాట్లు, నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
    ఆర్ట్స్‌ కాలేజీలో హాజరు ఎక్కువ..
    మొత్తం 23 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ కాలేజీ సెంటర్‌లోనే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సెంటర్‌లో ఉదయం 500 మందికి 268, మధ్యాహ్నం 275 మంది పరీక్ష రాశారు. అతితక్కువగా ఎస్‌ఆర్‌ నేషనల్‌ హైస్కూల్‌లో ఉదయం 539 మందికి 134 మంది మాత్రమే హాజరయ్యారు. సాయంత్రం సెషనల్‌లో యూనివర్సిటీ పీజీ కాలేజీలో 456 మందికి 116 మంది పరీ క్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో ఇదే తక్కువ హాజరుశాతమని అధికారులు వెల్లడించారు. కాగా, వికలాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఎస్‌ఆర్‌ నేషనల్‌ హైస్కూల్‌ సెంటర్‌లో మొత్తం 59 మందికి  గాన 21 మంది హాజరయ్యా రని అధికారులు తెలిపారు. 
మరిన్ని వార్తలు