అధికార పార్టీలో రోజుకో లొల్లి

6 May, 2016 12:16 IST|Sakshi

     పాణ్యంలో మాజీ మంత్రుల మధ్య వివాదం
     అగ్గి రాజేసిన కాంట్రాక్ట్ వ్యవహారం
     తనకు విలువ ఏముంటుందని ఏరాసు కినుక
     అధిష్టాన వైఖరే అలజడికి కారణమంటున్న తెలుగు తమ్ముళ్లు

 
కర్నూలు: అధికార పార్టీలో రోజుకో రగడ తెరమీదకు వస్తోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు- అప్పటికే ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జీల మధ్య నెలకొన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో ఒక ప్రైవేటు కాంట్రాక్టు విషయంలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య వివాదం చెలరేగింది. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కేఈ కుటుంబానికి చెందిన వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడంపై పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

అందులోనూ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని మరీ కాంట్రాక్టు ఇప్పించడం పట్ల ఆయన కినుక వహిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఒక ప్రైవేటు సిమెంట్ కంపెనీకి నంద్యాల నుంచి శ్లాబ్ సరఫరా కాంట్రాక్టును కేఈ కుటుంబానికి ఇప్పించినట్టు సమాచారం. ఈ కాంట్రాక్టు విలువ నెలకు రూ. 50 లక్షల మేరకు ఉంది. విషయం తెలుసుకున్న ఏరాసు.. నియోజకవర్గంలో వారికి పనులు ఇప్పించడమా అని వాపోతున్నారు. ఇప్పటికే పాణ్యం నియోజకవర్గం ఇన్‌చార్జ్ వ్యవహారంలో ఇద్దరి మధ్య విభేదాలు గుప్పుమంటుండగా... తాజాగా కాంట్రాక్టు వ్యవహారం మరింత అగ్గి రాజేసింది.
 
పాణ్యం పోరు పదనిసలు
వాస్తవానికి పాణ్యం నియోజకవర్గ విషయంలో అటు కేఈ కుటుంబానికి.. ఇటు ఏరాసుకు మధ్య రగడ నడుస్తోంది. పాణ్యంపై సదరు రాజకీయ కుటుంబానికి చెందిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌కు కన్ను ఉంది. పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు తనకు అప్పగించాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కోరుతున్నారు. ఇందుకోసం నూతన సంవత్సర వేడుకలను ఆయన వేదికగా చేసుకున్నారు. నియోజకవర్గానికి చెందిన నేతలను పిలిచి ఓర్వకల్లు సమీపంలోని రాక్‌గార్డెన్ వేదికగా భారీ పార్టీ ఇచ్చారు.

ఇందుకు అనేక మంది అధికార పార్టీ నేతలు హాజరయ్యారు. అదేవిధంగా మా ఊరు- జన్మభూమి సభలను కూడా వేదికగా చేసుకుని తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. విషయం తెలుసుకున్న ఏరాసు.. హడావుడిగా విదేశాల నుంచి తిరిగి వచ్చి మరీ సభల్లో పాల్గొన్నారు. అయితే, కేఈ ప్రభాకర్ ప్రయత్నాలు సఫలం కాలేదు. పాణ్యం ఇన్‌చార్జిగా ఏరాసే ఉంటారని అధిష్టానం స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని చల్లపరచడానికా అన్నట్టు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు అప్పగించినట్టు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం వ్యవహరించిన తీరు పట్ల ఏరాసు గుర్రుగా ఉన్నారు.


 అధిష్టానమే ఇలా చేస్తే ఎలా?
ప్రశాంతంగా ఉన్న పార్టీలో అధిష్టానం వైఖరితోనే అలజడి రేగుతోందని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. ఇప్పటికే కోడుమూరు నియోజకవర్గంలో విష్ణుకు, మణిగాంధీకి మధ్య వార్ మొదలయింది. గూడూరు జాతర వేదికగా ఏకంగా రథోత్సవాన్ని నిలిపి మరీ తన పంతాన్ని నెగ్గించుకునేందుకు మణిగాంధీ యత్నించారు. జాతర వేదికగా ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇక నంద్యాల, ఆళ్లగడ్డలో రోజుకో వైరం తెరమీదకు వస్తోంది. ఏకంగా సీఎం సాక్షిగా ఇరు వర్గాలను రాజీ కుదర్చాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇంకో గ్రూపును ప్రోత్సహించే పేరుతో పార్టీ పెద్దలే అగ్గిరాజేస్తే ఎలా అని నియోజకవర్గ ఇన్‌చార్జీలు వాపోతున్నారు. మొత్తంగా అధికార పార్టీలో రోజుకో రగడ తెరమీదకు వస్తోంది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా