తర‘గతి’ లేకున్నా పట్టదా?

2 Nov, 2016 23:01 IST|Sakshi
తర‘గతి’ లేకున్నా పట్టదా?
పాఠశాల ఆవరణలో భవనం కుట్టుశిక్షణకు కేటాయింపు
వరండాలో చదువుతో అవస్థలు పడుతున్న విద్యార్థులు
ప్రజాప్రతినిధి పంతానికి తలవంచిన కార్పొరేషన్‌  అధికారులు
విద్యాకమిటీ కాదన్నా... తల్లిదండ్రులు వద్దన్నా... హెచ్‌ఎం అభ్యంతరం చెప్పినా... చివరకు ప్రజాప్రతినిధి పంతమే నెగ్గింది. తరగతి గదిలేక పిల్లలు ఎండ వేడిమి, వర్షం తాకిడి తట్టుకుంటూ వరండాలోనే చదువుతున్నా పట్టించుకోకుండా ఖాళీగా ఉన్న హాలును ఓ కుట్టు శిక్షణ కేంద్రానికి కేటాయిస్తూ నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీస్తోంది. ఇలా అయితే టీసీలు తీసుకుని వెళ్లిపోతామంటూ విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించినా బేఖాతరు చేస్తూ అధికారులు ఆ ప్రజాప్రతినిధిని సంతృప్తి పరిచేందుకే ప్రాధాన్యం ఇచ్చిన తీరు వివాదానికి ఆజ్యం పోస్తోంది. 
కాకినాడ : కాకినాడ రామకృష్ణారావుపేటలో మదర్‌థెరిస్సా మున్సిపల్‌ కార్పొరేషన్‌  ప్రాథమిక పాఠశాల ఉంది. ఇటీవలే ఈ స్కూల్‌ను ఈ – పాఠశాలగా ప్రకటించి ఆధునిక విద్యాబోధనకు కూడా శ్రీకారం చుట్టారు. 5 కేఎన్‌  కంప్యూటర్లు కూడా సమకూర్చారు. ఒకప్పుడు తెలుగు మీడియం మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారు. దీంతో గత ఏడాది వరకు 90మందికి మించని ఈ పాఠశాలలో ప్రస్తుతం 153 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ 1 నుంచి 4వ తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతి గదులు ఉన్నాయి. 5వ తరగతి విద్యార్థులకు స్కూల్‌ వరండాలో విద్యాబోధన చేస్తున్నారు.
కమ్యూనిటీ హాలు ఖాళీగా ఉన్నా..
స్కూల్‌ ఆవరణలో ఒకప్పుడు కమ్యూనిటీ హాలుగా వినియోగించిన భవనం ఖాళీగా ఉంది.  ఈ భవనంలో ఐదవ తరగతి గది నిర్వహించుకునేందుకు హెచ్‌ఎం సీహెచ్‌ విజయలక్ష్మి కమిషనర్‌కు ప్రతిపాదనలు కూడా పంపారు. 
లెక్కచేయక... కుట్టు శిక్షణకు మొగ్గు
విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సుతో ఆ ప్రాంగణాన్ని కుట్టు శిక్షణ కేంద్రానికి ఇచ్చారు. మైనార్టీలకు కుట్టు శిక్షణ పేరుతో దీనిని ప్రతిపాదించినప్పటికీ ఆ సంస్థ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి అధీనంలో పనిచేస్తుందో కూడా తెలియదు.  
ఆగ్రహించిన తల్లిదండ్రులు
పిల్లలు ఆరుబయట చదువుకుంటున్నా పట్టని అధికారులు ఎలాంటిధ్రువపత్రాలు లేని ప్రైవేటు సంస్థకు హాలును కట్టబెట్టడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. శిక్షణ కేంద్రాన్ని వేరొక చోటకు తరలించి ఆ ప్రాంగణాన్ని తరగతిగా ఇవ్వాలంటూ డిమాండ్‌ చేసినా పట్టించుకోలేదు. ఇలాగైతే టీసీలు తీసుకుని తమ పిల్లలను బయటకు తీసుకువెళ్లిపోతామంటూ గొడవపడ్డారు. విద్యాకమిటీ సభ్యులు కూడా అదే స్థాయిలో అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒకానొకదశలో స్థానికులు ఆ భవనానికి తాళాలు వేస్తే దానిని తొలగించి ఆ శిక్షణ కేంద్రానికి అప్పగించడం వెనుక స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడే కారణమంటున్నారు. 
నిర్వాహకురాలితో వాగ్వాదం
కుట్టుశిక్షణ ప్రారంభించేందుకు బుధవారం మధ్యాహ్నం వచ్చిన నిర్వాహకురాలు విజయలక్షి్మతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అనుమతి పత్రాలు చూపించాలంటూ నిలదీశారు. అవేమీ తన వద్ద లేవని, పది రోజుల్లో వస్తాయంటూ ఆమె చెప్పిన సమాధానం తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.
మరిన్ని వార్తలు