జాడలేని డంపింగ్‌ యార్డులు

28 Feb, 2017 04:04 IST|Sakshi
జాడలేని డంపింగ్‌ యార్డులు

► ఏర్పాటుకు చర్యలే తీసుకోని అధికారులు
► గ్రామాలలో తీవ్రమవుతున్న ‘చెత్త’ సమస్య
► రోడ్ల పక్కనే తగులబెడుతున్న వైనం
► రోగాలపాలవుతున్న స్థానికులు


శంషాబాద్‌ రూరల్‌: గ్రామీణ ప్రాంతాలలో చెత్త సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతోంది..ఓ వైపు ప్లాస్టిక్‌ వినియోగం పెరిగిపోతుండగా.. మరో వైపు సేకరించిన చెత్తను వేయడానికి స్థలం లేక ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల పక్కన పడవేసి కాల్చేస్తున్నారు. దీంతో అందులోని ప్లాస్టిక్‌ కారణంగా వాయు కాలుష్యం ఏర్పడి గ్రామీణులు రోగాల పాలవుతున్నారు. పెద్దషాపూర్, తొండుపల్లి, కాచారం, కవ్వగూడ, నర్కూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, ఊట్‌పల్లి, పాల్మాకుల, మదన్ పల్లి, శంకరాపురం, హమీదుల్లానగర్, మల్కారం, నానాజీపూర్, రామంజాపూర్, ముచ్చింతల్, ఘాంసిమియాగూడ, గొల్లపల్లి, జూకల్, సుల్తాన్ పల్లి, పెద్దతూప్ర పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో చెత్త సమస్య తీవ్రంగా మారింది.

ఆయా గ్రామాల్లో ప్లాస్టిక్‌ నివారణకు చర్యలు లేకపోవడంతో, ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా కాకుండా ఒకే రకంగా సేకరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, రోడ్ల పక్కన పార బోస్తున్నారు. నర్కూడలోని చెత్తను సమీపంలోని చెరువులో వేస్తున్నారు. ఇక పెద్దషాపూర్‌లో చెత్తను జూకల్‌ వెళ్లే దారిలోని స్మశానవాటిక స్థలం లోనే వేసి కాల్చేస్తున్నారు. కాచారంలోని చెత్తను షాబాద్‌ రోడ్డు పక్కన ఉన్న వరద కాలు వలో వేస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో సైతం పరిస్థితి ఇలా గే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో చెత్త నుంచి వెలువడే దుర్గంధంతో అవస్థలు తప్పడం లేదు. చెత్తను కాల్చివేసే సమయంలో అందులోని ప్లాస్టిక్‌ నుంచి వెదజల్లే కాలుష్యంతో శ్వాస సంబంధిత రోగాల బారిన పడుతున్నా మని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

కాగితాల మీదనే ప్రతిపాదనలు..
అన్ని గ్రామాల్లో చెత్త డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం అనువైన స్థలాలను ఎంపిక చేయడానికి రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేపట్టారు. కానీ, చాలా చోట్ల స్థలాభావంతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. తొండుపల్లి పంచాయతీ పరిధిలో చెత్త డంపింగ్‌ యార్డు కోసం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ప్రభుత్వ స్థలం కేటాయించారు. చెత్త వేయడానికి అనువుగా గోతులు కూడా తీశారు.

సేకరించిన చెత్తను ఇక్కడకు తరలించడానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇక్కడ చెత్త వేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అక్కడి కాలనీ వాసులు అభ్యంతరం చెబు తున్నారు. స్థలాలు లేక కొన్ని చోట్ల..ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితులు నెలకొనడంతో సమస్యకు పరిష్కారం దొరకడంలేదు.

మరిన్ని వార్తలు