ఆక్వా పార్క్‌ ఏర్పాటుకు సీఎం సుముఖం

16 Sep, 2016 02:24 IST|Sakshi
నరసాపురం : తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు పూర్తి సుముఖంగా ఉన్నారని నరసాపురం సబ్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ చెప్పారు. ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం, ఇతర విషయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫుడ్‌ పార్కు విషయంలో జరుగుతున్న ఆందోళనలు, లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిందన్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి మధుసూదనరావు, మత్స్యశాఖ ఏడీ పి.రామ్మోహన్‌రావు, ఆంధ్రా యూనివర్సిటీ బయోటెక్నాలజీ ఫ్రొఫెసర్‌ ఎస్‌.సందీప్‌లను నియమించినట్టు చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారని చెప్పారు. 
ఆరెంజ్‌ గ్రేడ్‌ ఫ్యాక్టరీ
ఫ్యాక్టరీ ద్వారా ఎలాంటి హానికరమైన వ్యర్థాలు వెలువడవని సబ్‌కలెక్టర్‌ వివరించారు. అది ఆరెంజ్‌ గ్రేడ్‌ ఫ్యాక్టరీగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ గుర్తించిందన్నారు. వ్యర్థాలను పైప్‌లైన్‌ల ద్వారా సముద్రంలో కలపడానికి యాజమాన్యం అంగీకరించందిన్నారు. రూ.11 కోట్లతో పైప్‌లైన్లు నిర్మించనున్నారని సబ్‌ కలెక్టర్‌  చెప్పారు. ప్రత్యక్షంగా ఫ్యాక్టరీ ద్వారా 2 వేల మందికి, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు గ్రాంట్‌గా అందిస్తుందన్నారు. ఆయా గ్రామాల ప్రజలకు ఈ విషయాలను చెప్పి ఒప్పిస్తామని తెలిపారు. 
 
మరిన్ని వార్తలు