రాష్ట్రపతికి ఘన స్వాగతం

23 Dec, 2016 01:08 IST|Sakshi
రాష్ట్రపతికి ఘన స్వాగతం

హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల్లో శీతాకాల విడిదికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ నుంచి హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, పలువురు ఉన్నతాధికారులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి రాష్ట్రపతి సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకున్నారు. ఈ నెల 31 వరకు రాష్ట్రపతి నిలయంలోనే బస చేస్తారు.

ఇక్కడినుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. 23న సికింద్రాబాద్‌లోని ఆర్మీ దంతవైద్య కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అదేరోజు తెలంగాణ, ఏపీ వాణిజ్య పారిశ్రామిక మండలి (ప్యాఫ్సీ) శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు. 24న హైదరాబాద్‌లో మహిళా దక్షత సమితి, బన్సీలాల్‌ మాలాని నర్సింగ్‌ కళాశాలను ప్రారంభిస్తారు. 25న బెంగళూరుకు వెళ్లి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేరోజు హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 30న రాష్ట్రపతి నిలయంలో జరిగే తేనీటి విందుకు గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు హాజరవుతారు.

మరిన్ని వార్తలు