సారొస్తారట...!

3 Feb, 2016 03:41 IST|Sakshi
సారొస్తారట...!

సాక్షిప్రతినిధి,ఖమ్మం: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగియడంతో జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది. ఆయన ఎప్పుడు జిల్లాలో పర్యటిస్తారు..? ఏ పథకాలపై సమీక్షిస్తారు..? ఏం ప్రకటిస్తారోనని..? అధికారులు నివేదికల తయారీలో తలమునకలయ్యారు. రెండురోజులుగా కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ ప్రధాన పథకాల అమలుతీరుపై అధికారులతో సమావేశమవుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ నేడో..రేపో జిల్లాలో పర్యటిస్తుందన్న సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసినందున ఇక వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలే తరువాయే అన్న చర్చ జోరుగా  సాగుతోంది.
 
ముఖ్యమంత్రి ఖమ్మం నగరం, జిల్లాలో పర్యటించిన తర్వాతే ఎన్నికలుండే అవకాశాలున్నారుు. కాగా అధికారులు మాత్రం సీఎం పర్యటనకు సంబంధించి అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఖమ్మంపై దృష్టి పెడతారని, జిల్లాలోని వాటర్‌గ్రిడ్, మిషన్‌కాకతీయ పథకాలపై సమీక్షిస్తారని అధికారులు ఆ దిశగా ఈ పథకాలు ఏ స్థాయిలో ఉన్నాయో రోజూ సమీక్షిస్తున్నారు. పాలేరు-మాదిరిపురం, దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలకు కూడా శంకుస్థాపన చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
 
అయితే ముఖ్యమంత్రి పర్యటన ముందుగా ప్రతి జిల్లాలో సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ పర్యటించి ఏ పథకాలు ఏ దశలో ఉన్నాయో.. నివేదికను సీఎంకు అందజేస్తారు. జిల్లాలో కూడా ముందస్తుగా ఆమె పర్యటన ఉంటుందని సమాచారం. బుధ, గురువారం జిల్లాలో వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయతోపాటు పలు పథకాలకు సంబంధించి అమలు ఎలా ఉందో ఆకస్మిక తనిఖీ చేయనున్నట్లు తెలిసింది. ఆమె జిల్లాపై ఇచ్చిన నివేదిక ఆధారంగాా సీఎం పర్యటన షెడ్యూల్‌పై అధికారులు కసరత్తు చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది.
 
కార్పొరేషన్ ఎన్నికలపైనే ఉత్కంఠ..
 ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కార్పొరేషన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగియడంతో ఈనెలలో ప్రభుత్వం పెడుతుందా..మార్చి తర్వాత నిర్వహిస్తుందా..? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని పార్టీలు  డివిజన్లలో ప్రచారాన్ని ఇప్పటికే హోరెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితులుఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మార్చి 2నుంచి ఇంటర్, ఆతర్వాత పదో తరగతి పరీక్షలు ఉండటంతో ఈ కొద్ది సమయంలో ప్రభుత్వం ఎన్నికలకు వెళుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.  మొత్తంగా సీఎం పర్యటన మాత్రం ఈనెలలో ఉంటుందని అధికారులు కూడా హడావిడి చేస్తున్నారు.
 
 హెలిప్యాడ్ పరిశీలన
 వాజేడు : తెలంగాణ సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ మండలంలో బుధవారం పర్యటించే అవకాశం ఉందనే నేపథ్యంలో మండల అధికారులు పూసూరులో హెలిప్యాడ్ ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు ఆమె వస్తున్నట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు