ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతం మరిచారు

11 Sep, 2016 22:52 IST|Sakshi
ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతం మరిచారు

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

వికారాబాద్‌: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ విమోచనను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేసిన కేసీఆర్‌ పదవిలోకి రాగానే గతం మరిచారని విమర్శించారు. సౌండ్‌ పొల్యూషన్‌, టైమ్‌ మెయింటెనెన్స్‌ అంటూ.. హిందువుల పండుగలపై అనేక ఆంక్షలు పెడుతున్న రాష్ట్ర సర్కార్‌.. ముస్లింల వేడుకలకు మాత్రం నిబంధనలేవీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుప్రీం కోర్టు చేసిన చట్టం ప్రకారం గోవధపై నిషేధం ఉన్నా.. తెలంగాణలో వేలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

          తెలంగాణ ఏర్పాటులో సర్దార్‌ వల్లబాయ్‌పటేల్‌ కీలకంగా వ్యవహరించారని తెలిపారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదన్నారు. మహనీయుల చరిత్రలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే తమ పార్టీ తిరంగాయాత్రను ప్రారంభించిందని స్పష్టంచేశారు. వికారాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి ప్రజాధరణ ఉన్నా.. గ్రూపు రాజకీయాల వల్ల బలహీనమవుతోందని పలువురు విలేకరులు ఆయనను అడగగా.. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించరని, అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతంపై దృష్టిసారించారని స్పష్టంచేశారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పాండుగౌడ్‌, నాయకులు చౌదరి యాదవరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్‌, మాజీ ప్రధాన కార్యదర్శి శివరాజ్‌, నాయకులు మాధవరెడ్డి, కేపీ రాజు, విజయ్‌భాస్కర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోకల సతీష్‌గుప్త, బీజేవైఎం నాయకులు అనిల్‌, వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు