రెండు, మూడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి

21 Nov, 2015 02:24 IST|Sakshi
రెండు, మూడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి

♦ నీటిపారుదలశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్
♦ నిర్మాణంలో జాప్యం నివారణకు చర్యలు
♦ పనులకు తగినట్లు చెల్లింపులు
♦ నీటిపారుదల శాఖ ద్వారానే నిధుల ఖర్చు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను రెండు, మూడేళ్లలోనే పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ  సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు కృష్ణా నదిపై పాలమూరు, డిండి... గోదావరిపై కాళేశ్వరం, ప్రాణహిత, దుమ్ముగూడెం వంటి పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇందుకు వీలుగా ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించడాన్ని అత్యధిక ప్రాధాన్యతగల అంశంగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లతో వేగంగా పనులు చేయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, వారికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడానికి అనువుగా బడ్జెట్ కేటాయింపులను నేరుగా నీటిపారుదలశాఖ ఖర్చు పెట్టేలా విధానాన్ని రూపొందించాలని సూచించారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలకు అనేక ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఈ క్రమంలో పాలనాపరమైన జాప్యాన్ని వీలైనంత వరకు తొలగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని, అదే క్రమంలో రైతులకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా భూసేకరణ విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, వేగంగా భూసేకరణ జరుగుతోందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

 పనులకు తగినట్లు చెల్లింపులు..
 ఏటా రూ. 25 వేల కోట్లను నీటిపారుదలశాఖకు కేటాయిస్తున్నందున ఈ నిధులను పనులు జరుగుతున్నదాన్నిబట్టి నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయకు చెల్లింపులు జరపాలని సీఎం కేసీఆర్ సూచించారు. కాంట్రాక్టర్లను మూడు షిఫ్టుల్లో పనిచేయించడం ద్వారా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్నాది ప్రభుత్వ సంకల్పమన్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ఒక శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని, గడువులోగా పూర్తి చేయకుంటే జరిమానా విధించే విధానం ఉండాలన్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లలో ఉత్సాహం, బాధ్యత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థికశాఖ కార్యదర్శులు శివశంకర్ , రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు