సీహెచ్‌సీకి మహర్దశ

19 Feb, 2018 09:10 IST|Sakshi

బెల్లంపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం అప్‌గ్రేడ్‌

30 నుంచి 100 పడకలకు పెరగనున్న సామర్థ్యం

రూ.17.50 కోట్లు నిధులు మంజూరు

ఫైలుపై సీఎం సంతకం.. వారం రోజుల్లో జీవో ?

బెల్లంపల్లి: బెల్లంపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)కు ఎట్టకేలకు మహర్దశ పట్టబోతోంది. ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివకే ఫైలుపై సీఎం కేసీఆర్‌ సంతకం చేయగా.. వారం రోజుల్లో జీవో వెలువడనున్నట్లు తెలుస్తోంది. 30 పడకల సామర్థ్యం ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)ను 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే ప్రభుత్వం జిల్లా కేంద్రం మంచిర్యాలలోని 100 పడకల ఆస్పత్రిని 250 పడకలకు, 30 పడకల సామర్థ్యం కలిగిన లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను కూడా అప్‌గ్రేడ్‌ చేయడానికి సీఎం సంబంధిత ఫైలుపై సంతకం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఉత్తర్వుల ప్రతి వారం రోజుల వ్యవధిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బెల్లంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింతగా అందుబాటులో రానున్నాయి.

రూ.17.50 కోట్లు మంజూరు
బెల్లంపల్లిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి సన్నద్ధమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రూ.17.50 కోట్లు నిధులు విడుదలకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ప్రస్తుతం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు పక్కా భవనం ఉన్నా పాతది కావడంతో పగుళ్లు తేలి పనికిరాకుండా ఉంది. ఆపరేషన్‌ థియేటర్‌ గది శిథిలావస్థకు చేరి అధ్వానంగా తయారైంది. వార్ఢులు కూడా అస్తవ్యస్తంగా ఉండడంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నూతన భవనం నిర్మించి, పడకల సామర్థ్యం పెంచి, సరిపడా వైద్యులు, సిబ్బందిని కేటాయించాలనే డిమాండ్‌ కొన్నాళ్ల నుంచి ఉన్నా ఇన్నాళ్ళకు కానీ మోక్షం కలుగలేదు. అప్‌గ్రేడ్‌ కానుండడంతో రోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అధునాతనంగా భవనం నిర్మించి మెరుగైన వైద్యసేవలు అందించనున్నారు.

రోజుకు 400పైనే రోగులు
కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ అయినా రోజువారీగా రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. చుట్టు పక్కల ప్రాంత రోగులకు దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తోంది. రోజుకు 300 నుంచి 400 మంది వరకు రోగులు చికిత్స కోసం వస్తుంటారు. మంగళ, బుధ, శుక్రవారాల్లో ఆ సంఖ్య గరిష్టంగా రోజుకు 800 వరకు ఉంటుందని అంచనా. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోయినా ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో చికిత్స కోసం రోగులు అనివార్యంగా వచ్చిపోతుంటారు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న తిర్యాణి, రెబ్బెన, దహెగాం మండలాల రోగులు కూడా ఇక్కడికి వచ్చి చికిత్స తీసుకుని వెళ్తుంటారు. రోడ్డు, రైల్వే మార్గం ఉండడంతో సహజంగానే రోగుల సంఖ్య పెరుగుతోంది.

అప్‌గ్రేడ్‌తో..
ఆరోగ్య కేంద్రం 100 పడకలకు అప్‌గ్రేడ్‌ కానుండడంతో వైద్యులు, సిబ్బంది పోస్టులు పెరగనున్నాయి. కనీసం 15 మంది వరకు వైద్యులు, 60కి పైగా అన్ని రకాల సిబ్బంది నియామకం కానున్నారు. వీరి నియామకంతో ఇకపై మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి కొన్ని రోగాలకు తప్పా దాదాపు అన్ని రకాల రోగాలకు బెల్లంపల్లిలోనే వైద్యం అందనుంది. హెల్త్‌ సెంటర్‌కు విశాలమైన ఖాళీ స్థలం కలిసొచ్చే అంశం. అధునాతనంగా ఆసుపత్రిని నిర్మించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం హెల్త్‌ సెంటర్‌ ఆవరణలో వైద్యులు, సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్లు వినియోగంలో లేకుండా వృథాగా ఉంటున్నాయి. అప్‌గ్రేడ్‌ అయ్యాక వీటిని వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు.హెల్త్‌ సెంటర్‌ ప్రాంగణంలో దాదాపు 15 ఎకరాల వరకు ఖాళీ భూమి ఉండడం వల్ల భవిష్యత్‌లో ఆసుపత్రికి మరింత ప్రయోజనం కలుగనుంది.

సీఎం సంతకం చేశారు..
బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను అప్‌గ్రేడ్‌ చేయడానికి సీఎం కేసీఆర్‌ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన జీవో వారం రోజుల్లోగా అధికారికంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. హెల్త్‌ సెంటర్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు. సముచిత నిర్ణయం తీసుకున్న సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి

మరిన్ని వార్తలు